బ్యాంకులు మరిన్ని వస్తే మంచిదే.. | sakshi business special interview yes bank Senior Group President pralay Mondal | Sakshi
Sakshi News home page

బ్యాంకులు మరిన్ని వస్తే మంచిదే..

Published Tue, May 10 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

బ్యాంకులు మరిన్ని వస్తే మంచిదే..

బ్యాంకులు మరిన్ని వస్తే మంచిదే..

యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రళయ్ మండల్
పోటీ పెరిగితే బ్యాంకింగ్ పరిధీ పెరుగుతుంది
రిటైల్ రుణాలు మరింత పెంచుకుంటాం
త్వరలో క్రెడిట్ కార్డు తెస్తున్నాం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా దేశీయంగా మరిన్ని బ్యాంకుల రాక ఆహ్వానించతగ్గ పరిణామమే అంటున్నారు యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ (రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ విభాగం) ప్రళయ్ మండల్. వీటి వల్ల పోటీ పెరిగినా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా విస్తరించి అవకాశాలూ పెరుగుతాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారాయన. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

ఆన్-ట్యాప్ బ్యాంకింగ్ లెసైన్సుల ప్రతిపాదనపై...
వివిధ కారణాల రీత్యా గత కొన్నాళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విస్తరణ మందగించింది. ఇక విదేశీ బ్యాంకుల మార్కెట్ కూడా తగ్గుతోంది. గతంలో ఆరు శాతం పైగా ఉన్నది ప్రస్తుతం నాలుగు శాతం స్థాయిలో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, స్వదేశాల్లో సమస్యలు, నియంత్రణపరమైన అంశాలు మొదలైన వాటి ప్రభావంతో పలు విదేశీ బ్యాంకులు వైదొలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి తోడ్పడగలవు. ఇక పోటీ అంటారా.. చాలా మటుకు బ్యాంకులు నిలదొక్కుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అలాగే తమ విశిష్టతను చాటుకునేలా ప్రత్యేక విభాగాలను గుర్తించి, ఎదిగేందుకు సమయం పడుతుంది. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు నిలబడతాయి. మరికొన్ని విజయం సాధించలేకపోవచ్చు.

 పేమెంట్, చిన్న బ్యాంకుల నుంచి పోటీ..
కొత్తగా పలు పేమెంట్ బ్యాంకులు, చిన్న బ్యాంకులు వస్తున్నాయి. ఇవి విభిన్న వర్గాల కోసం ఉద్దేశించినవి. ఎక్కువగా నగదు లావాదేవీలు జరిపే వారిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు పేమెంట్ బ్యాంకులు ఉపయోగపడతాయి. వీటి రాకతో మొబైల్ పేమెంట్స్ తదితర చెల్లింపుల విధానాలు అభివృద్ధి చెందుతాయి.అయితే,  పరిమితమైన సేవలు అందించే చెల్లింపుల బ్యాంకులు మిగతా కార్యకలాపాల కోసం మళ్లీ ప్రధాన బ్యాంకుల తోడ్పాటు తీసుకోవాల్సి ఉంటోంది. పేమెంట్ బ్యాంకుల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే వారి సంఖ్య విస్తరిస్తుంది.  వాణిజ్య బ్యాంకులకు వీటి నుంచి ఎక్కువ సమస్యా ఉండబోదు.

కానీ దాదాపు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందించే చిన్న బ్యాంకుల నుంచి కొంత పోటీ ఉండొచ్చు. అయితే, వీటి పరిధి కూడా కొంత వరకే పరిమితం అవుతుంది కనుక, పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవల కోసం ఖాతాదారులు మళ్లీ ప్రధాన బ్యాంకులవైపే మళ్లవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే వారి సంఖ్య విస్తరిస్తుంది. చిన్న బ్యాంకుల పరిధిని దృష్టిలో పెట్టుకుంటే ఇవి ఎక్కువగా ఇతరత్రా స్థానిక, ప్రాంతీయ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మొదలైన వాటికి ఎక్కువగా పోటీ ఇవ్వొచ్చు.

డిజిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యయాలు పెరిగిపోవడంపై...
చార్జీలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్ వంటి మరిన్ని బ్యాంకింగ్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న వ్యాపారస్తులు మొదలైన వారి కోసం బంచ్ నోట్ యాక్సెప్టర్స్ వంటివి కూడా తెచ్చాం. ఇలాంటి వాటి వల్ల ప్రతీ బ్యాంకింగ్ లావాదేవీకి పనులు మానుకుని, లేదా సెలవు పెట్టుకుని మరీ బ్యాంకులకి వెళ్లాల్సిన సమస్య తగ్గింది. ఖాతాదారులకు ప్రయోజనకరంగా ఉంటున్న ఈ తరహా సాధనాల ద్వారా జరిపే లావాదేవీలపై నామమాత్రపు చార్జీలే ఉంటున్నాయి.

ఎన్‌పీఎల కట్టడిపై..
మా వ్యాపారంలో 65 శాతం కార్పొరేట్, 35 శాతం రిటైల్ వాటా ఉంటోంది. మా నికర ఎన్‌పీఏలు సుమారు 0.29 శాతం మేర ఉన్నాయి. కార్పొరేట్‌తో పోలిస్తే అధిక మార్జిన్లు ఉండే రిటైల్, ఎస్‌ఎంఈల రుణాల్లో ఎన్‌పీఏలు కొంత అధికంగా ఉంటాయి. కార్పొరేట్ల రుణాల విషయానికొస్తే... ప్రతి అంశాన్ని ఆయా రంగాల్లో నిపుణులైన టీమ్‌లు నిశితంగా అధ్యయనం చేస్తాయి. మా దగ్గర ఇలాంటి ఏడెనిమిది నాలెడ్జ్ విభాగాలు ఉన్నాయి.  కొన్నాళ్ల క్రితం సమస్యాత్మక రంగాలకు రుణాలిచ్చిన కన్సార్షియంలలో మా బ్యాంకు పరిమాణం దృష్ట్యా మేం భాగం కాలేదు. దీంతో  కన్సార్షియంలపరమైన ఒత్తిళ్లేమీ లేవు.  ఆయా రంగాల్లో మొండి బకాయిల ప్రభావాలు మాపై పెద్దగా లేవు. ఒత్తిడిలో ఉన్న సంస్థలకు ఆర్థిక తోడ్పాటునిచ్చినా బ్రిడ్జి ఫైనాన్సింగ్ మొదలైన వాటి రూపంలోనే ఉంటోంది కనుక ఎన్‌పీఏలపరమైన సమస్య పెద్దగా లేదు.

విస్తరణ ప్రణాళికలు..
దశాబ్దం పైగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్న మా బ్యాంకుకు ప్రస్తుతం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో 1.3 శాతం మేర మార్కెట్ వాటా ఉంది. దీన్ని 2020 నాటికి 2.5 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నాం. అప్పటికల్లా కార్పొరేట్, రిటైల్ విభాగాలను చెరి యాభై శాతం వాటాల స్థాయికి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం 900 పైచిలుకు శాఖలు, 1,200 పైగా ఏటీఎంలు ఉన్నాయి. శాఖల సంఖ్యను ఏటా 25 శాతం పెంచుకుంటున్నాం. 2020 నాటికల్లా 2,500 శాఖలకు చేరాలని నిర్దేశించుకున్నాం.  తెలంగాణలో 14, ఆంధ్రప్రదేశ్‌లో 11 శాఖలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెరి అయిదు శాఖలను ప్రారంభిస్తున్నాం. ఏపీలోని చిత్తూరు, ఒంగోలు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో కొత్తవి వస్తున్నాయి.  ఈ త్రైమాసికంలో క్రెడిట్ కార్డు కూడా ప్రవేశపెట్టబోతున్నాం.  ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా ఇటీవలే తెలంగాణలో టీ-హబ్‌తో చేతులు కలిపాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement