మందగమనమే కానీ..! | Sakthi Kantha Das to Banks on Loan Rates | Sakshi
Sakshi News home page

మందగమనమే కానీ..!

Published Tue, Aug 20 2019 8:58 AM | Last Updated on Tue, Aug 20 2019 8:58 AM

Sakthi Kantha Das to Banks on Loan Rates - Sakshi

ముంబై: ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన మాట వాస్తవమని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంగీకరించారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న మాటా వాస్తవమన్నారు. అయితే ప్రతిఒక్కరూ అవకాశాలు, ఆశావాదంపై దృష్టి పెట్టాలితప్ప నిరాశావాదంపై వద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అధికాదాయ వర్గాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై అధికపన్నులు సహా ఇటీవలి బడ్జెట్‌ చర్యల అనంతరం పలు కార్పొరేట్‌ వర్గాలు నరేంద్రమోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తాజా ప్రకటన చేశారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం– విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఆగస్టు 1 నుంచి 16వతేదీ మధ్య రూ.10,416.25 కోట్ల ఈక్విటీ అమ్మకాలు జరిపారు. డెట్‌ విషయంలో ఈ విలువ రూ. 2,096.4 కోట్లుగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, ఆటోమొబైల్‌ అమ్మకాల వంటి అన్ని స్థూల గణాంకాలు నిరాశను మిగుల్చుతున్నాయి. ఆయా అంశాలతో 3.5 లక్షల ఉద్యోగాలు పోయినట్లు కూడా గణాంకాలు పేర్కొంటున్నాయి.  గడచిన నాలుగు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షల్లో ఆర్‌బీఐ 110 బేసిస్‌ పాయింట్ల (1.1 శాతం) రెపో రేటును తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు తొమ్మిది సంవత్సరాల కనిష్టస్థాయి 5.4 శాతానికి చేరినా, ఇది వాస్తవ రూపంలో ఫలితం ఇవ్వడంలేదు. ఇక మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.8 శాతానికి పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో గవర్నర్‌ జాతీయ బ్యాంకింగ్‌ సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

ఆర్‌బీఐ నుంచి అందిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్‌ కస్టమర్లకు బదలాయింపు జరగాలి. రుణ రేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. తమ రుణాలు, డిపాజిట్‌ రేట్లను రెపోకు అనుసంధానించడానికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  
నేను వార్తా పత్రికలు చదువుతున్నా, బిజినెస్‌ చానల్స్‌ను చూస్తున్నా, తగిన సానుకూల, ఆశావాద పరిస్థితి ప్రతిబింబించడంలేదు. ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు ఉన్న మాట నిజమే. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం నుంచి భారత్‌ ఒంటరిగా ఉండలేదు.  
అయితే మనం ప్రతికూల పరిస్థితులను చూస్తూ, ఉండిపోకూడదు. ఆశావహ పరిస్థితులు, అవకాశాలపైనా దృష్టి సారించాలి. సవాళ్ల మధ్య పలు అవకాశాలు ఉన్నాయన్న అంశాలన్ని గుర్తించాలి.  
సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని తట్టుకోగల పరిస్థితుల్లో మన బ్యాంకింగ్‌ రంగం ఉంది. అయితే బ్యాంకులు తమ మూలధనానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా, క్యాపిటల్‌ మార్కెట్‌వైపు దృష్టి సారించాలి.  
నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల రుణ నాణ్యతను సమీక్షించబోవడంలేదు.  
ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై తక్షణం దృష్టి సారించాల్సిఉంది.  
బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల అంతర్గత సంబంధాలను ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement