మీ ఖాతా.. జర భద్రం!! | save your account .. !! | Sakshi
Sakshi News home page

మీ ఖాతా.. జర భద్రం!!

Published Sun, Aug 14 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

మీ ఖాతా..   జర భద్రం!!

మీ ఖాతా.. జర భద్రం!!

మోసగాళ్లు మరీ తెలివిమీరిపోతున్నారు
జాగ్రత్తలు తీసుకోకుంటే ఖాళీ కావొచ్చు


ఈ మధ్యే ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచిన ప్రశాంతికి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ... వెరిఫికేషన్ కోసం మీ డెబిట్ కార్డు నంబరు, సీవీవీ, వన్ టైమ్ పాస్‌వర్డ్ చెప్పండని అడిగాడు. యథాలాపంగా వివరాలన్నీ చెప్పేయబోయిన ప్రశాంతి ఆఖరు నిమిషంలో సందేహమొచ్చి అప్రమత్తమై సదరు వ్యక్తిని నిలదీసింది. వెంటనే బ్యాంకు శాఖకు ఫోన్ చేస్తే... అసలలాంటి ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ తమ నుంచి రావని స్పష్టంగా చెప్పారు.  దీంతో అప్పటికప్పుడు తను ఫిర్యాదు నమోదు చేసి, మళ్లీ పాస్‌వర్డ్‌లు మొదలైనవి మార్చుకుని జాగ్రత్తపడింది. మోసగాళ్లు చెలరేగిపోతున్న పరిస్థితుల్లో  మన కష్టార్జితం ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు మన వంతుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే..

 
పాస్‌వర్డ్ గోప్యంగా...

పాస్‌వర్డ్‌ను సాధ్యమైనంత వరకూ గోప్యంగా ఉంచాలి. ఖాతా వివరాలు ఎవరికీ చిక్కకుండా తరచూ మారుస్తుండాలి, అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు) కాంబినేషన్‌లో పటిష్టమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. వివిధ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించొద్దు. పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవడానికే ప్రాధాన్యమివ్వండి. మొబైల్  ఫోన్‌లో రాసి పెట్టుకోవడం తగదు.

 
ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్త..

ఇంటర్నెట్ కేఫ్‌లు.. లైబ్రరీలు మొదలైన చోట్ల, హోటళ్లు.. ఎయిర్‌పోర్ట్‌లలో వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కంప్యూటర్స్ నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం సురక్షితం కాదు. ఇలాంటి చోట్ల మీ పాస్‌వర్డ్‌ను మరొకరు చూడటమో లేదా ట్రేస్ చేయడమో జరిగే అవకాశాలెక్కువగా ఉంటాయి. ఒకవేళ అకౌంట్లోకి లాగిన్ కావాల్సి వస్తే క్యాషె, బ్రౌజింగ్ హిస్టరీని, టెంపరరీ ఫైల్స్‌ను కంప్యూటర్ నుంచి డిలీట్ చేయాలి.

 
పిన్ గోప్యంగా ఉంచాలి.
.
బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారుల కాన్ఫిడెన్షియల్ వివరాలను గురించి ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా అడగవు. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, సీవీవీ (మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వెనుక ఉండే 3 అంకెల నంబరు), డెబిట్ కార్డు పిన్ నంబరు.. ఎక్స్‌పైరీ తేదీ, వన్ టైమ్ పాస్‌వర్డ్ మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బ్యాంకు అధికారీ అడగరని గుర్తుంచుకోండి.  ఇలాంటి కీలక అంశాలు ఎవ్వరికీ చెప్పొద్దు.

 
ఖాతా స్టేట్‌మెంట్‌లు చెక్ చేసుకోవాలి..

ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించిన తర్వాత ఖాతాను పరిశీలించుకోవడం మంచిది. మీ ఖాతా నుంచి సరైన మొత్తమే డెబిట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తేడాలు గమనించిన పక్షంలో బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి.

 
బ్రౌజర్‌తో జాగ్రత్తలు..

బ్రౌజర్‌లో ఆటో సేవ్, ఆటో కంప్లీట్ వంటి ఫీచర్లు పనిచేయకుండా డిసేబుల్ చేయాలి. ఎందుకంటే సేవ్ చేసిన సమాచారాన్ని హ్యాకర్స్ లేదా మరెవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. పాస్‌వర్డ్‌లు, ఇతరత్రా కాన్ఫిడెన్షియల్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని క్లియర్ చేసేయండి. వెబ్‌సైట్లన్నింటిలోనూ సేవ్ పాస్‌వర్డ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి.

 
లాటరీ మెయిల్స్‌తో భద్రం ..

పరిచయం లేని వారి నుంచి వచ్చే ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడం గానీ లేదా డౌన్‌లోడ్ చేయడం గానీ చేయొద్దు. ఈ తరహా అటాచ్‌మెంట్స్ ద్వారా మీ ఫైల్స్‌ను, డేటాను చౌర్యం చేసే.. లేదా ధ్వంసం చేసే వైరస్‌లు గానీ ట్రోజన్‌లు గానీ సిస్టమ్‌లో ప్రవేశించవచ్చు.

 

సంజయ్ చౌగులే
హెడ్-ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ విభాగం, ఐసీఐసీఐ బ్యాంక్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement