పిన్‌తో జాగ్రత్త
డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అక్కడ కూడా పిన్‌ను వినియోగించే పద్ధతి ఈనెల ఒకటి నుంచీ అమల్లోకి వచ్చింది. కార్డును స్వైప్ చేసి బిల్లు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్‌వర్డ్ (పిన్) కూడా ఎంటర్ చేస్తేనే లావాదేవీ పూర్తి అవుతుంది. డెబిట్ కార్డుతో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఆర్‌బీఐ ఈ మేరకు నిబంధనలు మార్చింది. కాని ఇలా పిన్ ఎంటర్ చేసేటప్పుడు కనీస జాగ్రత్త పాటించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే షాపింగ్‌లో డెబిట్ కార్డును వినియోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...
ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ఏటీఎం పాస్‌వర్డ్ అనేది అత్యంత రహస్యంగా ఉంచుకోవాలి. ఈ పిన్ అందరికీ తెలిస్తే దీంతో ఎటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చన్న సంగతి మర్చిపోవద్దు. అంతే కాదు వారు కూడా బయట షాపింగ్‌కు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే ఈ పిన్‌ను మూడో వ్యక్తికి తెలవకుండా జాగ్రత్తపడండి. కౌంటర్ వద్ద పీవోఎస్ మెషీన్‌లో పిన్‌ను ఎంటర్ చేయాల్సినప్పుడు ఆ నంబర్‌ను బిల్ కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తికి చెప్పకుండా నేరుగా మీరే ఎంటర్ చేయండి. అలాగే ఎంటర్ చేసేటప్పుడు మిగిలిన వారికి కనపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
-విశాల్ సాల్వి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్