రిటైల్ రుణాలు బబుల్ కాదు: ఎస్ బీఐ
ముంబై: రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్‌లా ఉన్నాయనడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. రిటైల్ రుణాలు పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న బబుల్‌లాగా ఉన్నాయంటూ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించి రోజులు గడవకముందే అరుంధతి ఆయనతో విభేదించటం గమనార్హం. వినియోగదారుల రుణాలకు సంంధించి బబుల్ లాంటి పరిస్థితులు లేవన్నారు. డిజిటల్ సాధనాల తోడ్పాటుతో ఉత్తమమైన ప్రమాణాలను కొనసాగించినంత కాలం వినియోగదారుల రుణాల విభాగానికేమీ ఢోకా లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రిటైల్ రంగంలో జరగాల్సింది ఎంతో ఉందని, సాధించాల్సింది మరెంతో ఉందని చెప్పారు. జీడీపీలో రిటైల్ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలో (10 శాతం కంటే తక్కువగానే) ఉన్నాయని, మలేషియాలో 30-35 శాతంగా ఉండగా, వృద్ధి చెందిన దేశాల్లో ఇంకా అధికంగా ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడ జరిగిన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు. మన దేశంలో యువత అధికంగా ఉందని, వారి ఆశయాల కోసం మరిన్ని రుణాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.