సాక్షి, ముంబై: బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో తమ బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చంటూ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. కానీ తన శాఖలు, కార్యాలయాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
భారత బ్యాంక్ అసోసియేషన్ (ఐబిఎ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తరువాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. బ్యాంకుల వినీనం, తదితర డిమాండ్లతో పాటు 20 శాతం వేతన సవరణ, 5 రోజుల పనిదినాలు, పెన్షన్ల నవీకరణ, కుటుంబ పెన్షన్ల మెరుగుదల వంటివి డిమాండ్లను నెరవేర్చాలని యూనియన్లు కోరుతున్నాయి. తొమ్మిది సంఘాలు (ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్) ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment