అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం
ముంబై: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌తో ఎస్‌బీఐ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఖాతాదారులు, తమ బ్యాంక్ శాఖల్లో ఖాతాలున్న చిన్న వ్యాపారుల కోసం చెల్లింపు, కామర్స్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఎస్‌బీఐ తెలిపింది. డిజిటల్ కామర్స్ రంగంలో అమెజాన్ అతి పెద్ద కంపెనీ అని, తమకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులున్నారని, ఈ ఒప్పందం కారణంగా తమ ఖాతాదారులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు.
ఈ ఒప్పందంలో భాగంగా అమెజాన్‌కు ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్‌ఎంఈ ఖాతాదారులకు రుణాలు కూడా అందిస్తామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో తమ ఆర్థిక ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయించాలని కూడా యోచిస్తున్నామన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర ఈ-కామర్స్ సంస్థలతో కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎస్‌బీఐ వంటి దిగ్గజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ చెప్పారు.