వరల్డ్ టాప్-50 బ్యాంకులోకి ఎస్బీఐ
Published Sat, Apr 1 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రపంచంలోనే అతిపెద్ద టాప్-50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. 2017 ఏప్రిల్ 1 తనకు చరిత్రలో నిలిచిపోయే విధంగా అనుబంధ బ్యాంకులు ఐదింటినీ నేడు తనలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించేసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్(ఎస్బీబీజే), స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్బీఐ), స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్(ఎస్బీఎం), స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా(ఎస్బీపీ), స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్బీటీ)లను నేటి నుంచి తనలో విలీనం చేసుకుంటున్నట్టు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయ మహిళా బ్యాంకు విలీనాన్ని ప్రభుత్వం అంతకముందే చేపట్టింది. ఈ విలీనంతో ఆస్తుల పరంగా టాప్-50 గ్లోబల్ బ్యాంక్స్ లో ఒకటిగా చోటు దక్కించుకోబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియతో 37 కోట్ల కస్టమర్ బేస్ ను, దాదాపు 24వేల బ్రాంచుల నెట్ వర్క్, సుమారు 59వేల ఏటీఎంలు తన సొంతం కానున్నట్టు తెలిపింది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ కంటే 5 రెట్లు పెద్ద బ్యాంకుగా ఎస్‌బీఐ అవతరిస్తోంది. 2008లో మొదటిసారి ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ఆఫ్ సౌరాష్ట్రను తనలో విలీనం చేసుకుంది. రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండోర్ ను కలుపుకుంది. పూర్తిగా వ్యవస్థలన్నింటిన్నీ ఏకీకృతం చేయడానికి రెండు నెలలు పడుతుందని ఎస్బీఐ చెబుతోంది.
Advertisement
Advertisement