సాక్షి, న్యూఢిల్లీ : అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్‌బీఐ షాక్ ఇచ్చింది. నోట్ల రద్దు సమయంలో అదనపు పనిగంటలకు అందించిన పరిహారం వెనక్కి ఇవ్వాలని తాఖీదులు పంపడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిగంటలకు పరిహారం అందిస్తామని గతంలో బ్యాంకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2017న ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమవడం గమనార్హం. అయితే నోట్లరద్దు సమయంలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదని ఎస్‌బీఐ పేర్కొంటోంది.
నోట్ల రద్దు సమయంలో ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లకు చెందిన 70,000 మంది అధికారులు, సిబ్బంది అదనపు గంటలు పనిచేశారు. వీరికి ఓవర్‌టైమ్ చేసినందుకు ఎస్‌బీఐ హామీ ఇచ్చిన మేర పరిహారం చెల్లించింది. అయితే వీరు అదనంగా పనిచేసినందుకు అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎస్‌బీఐ కోరుతుండటంతో అనుబంధ బ్యాంకుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌టైమ్ చేసినందుకు ఇచ్చిన పరిహారం కేవలం తమ ఉద్యోగులకేనని, అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఇది వర్తించదని జోనల్ హెడ్‌క్వార్టర్లకు ఎస్‌బీఐ పంపిన సమాచారంతో ఆయా బ్యాంకుల సిబ్బంది మండిపడుతున్నారు.
గతంలో తమ అనుబంధ బ్యాంకుల సిబ్బందికి చెల్లించిన పరిహారంను తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌బీఐ తన జోనల్ మేనేజర్లను కోరడంతో సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిహారం రికవరీ ఉత్తర్వులను బ్యాంకు యూనియన్లు తప్పుపడుతున్నాయి. పరిహారం వెనక్కితీసుకోవాలని చూడటం సరైంది కాదని హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment