కమోడిటీల్లో ఇక ఆప్షన్ల ట్రేడింగ్
కీలక ప్రతిపాదనకు సెబీ పచ్చజెండా
► వ్యాలెట్ల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు
► కాకపోతే ఏడాదికి రూ.50వేలకు మాత్రమే పరిమితం
► క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లో వేస్తే కొనుగోలుకు నో
► నల్లధనం నియంత్రణకు పి–నోట్ల నిబంధనలు కఠినతరం
కేపిటల్ మార్కెట్ల మరింత పారదర్శకతే లక్ష్యం
ముంబై: కమోడిటీ డెరివేటివ్‌లలో ఇకపై ఆప్షన్ల కొనుగోలు, అమ్మకానికి లైన్ క్లియర్ అయింది. దీనికితోడు డిజిటల్ వ్యాలెట్ల నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి కూడా ద్వారాలు తెరుచుకోనున్నాయి. కార్పొరేట్ బాండ్ల సెకండరీ మార్కెట్ సైతం కొత్త పుంతలు తొక్కనుంది.
కేపిటల్ మార్కెట్లను మరింత పారదర్శకంగా, పటిష్ట పరిచే దిశగా నియంత్రణ సంస్థ సెబీ బుధవారం పలు కీలక సంస్కరణలకు తెరతీసింది. ఐపీవో మార్కెట్‌కు మరింత జోష్‌నిచ్చే నిర్ణయాలనూ ప్రకటించింది. అన్ని విభాగాలకూ కలిపి బ్రోకర్లకు యూనిఫైడ్ లైసెన్స్‌నూ ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ బ్యాంకులకు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ నిబంధనలను సులభతరం చేయాలని నిశ్చయించింది. సెబీ నూతన చైర్మన్ అజయ్ త్యాగి అధ్యక్షతన తొలిసారిగా ముంబైలో జరిగిన సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. భేటీలో తీసుకున్న నిర్ణయాలివీ...
కమోడిటీల్లో ఇక ఆప్షన్లు
కమోడిటీ మార్కెట్లలో ట్రేడింగ్ పరిమాణం పెంచే దిశగా సెబీ ఆప్షన్ల ట్రేడింగ్‌కు అనుమతించింది. ‘‘కమోడిటీ ఎక్సే్ఛంజీలు డెరివేటివ్ ఆప్షన్ల ట్రేడింగ్ చేపట్టేందుకు వీలుగా సెక్యూరిటీస్ కాంట్రాక్టు రెగ్యులేషన్స్ 2012ను సవరించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదించింది’’ అని సెబీ తెలిపింది. ఆప్షన్ల ట్రేడింగ్‌కు సంబంధించి సవివర మార్గదర్శకాలను జారీచేయనున్నట్టు పేర్కొంది..
వ్యాలెట్ల నుంచే మ్యూచ్‌వల్ ఫండ్స్
ఇకపై ఇన్వెస్టర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్ వ్యాలెట్ల నుంచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. గృహస్తుల పొదుపును కేపిటల్ మార్కెట్ల వైపు మళ్లించడంతోపాటు ఫండ్ పరిశ్రమలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ప్రతిపాదన చేశారు. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు ఈ వ్యాలెట్ల ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు’’ అని సెబీ తెలిపింది.
బాండ్లలో లిక్విడిటీ పెంపు
కార్పొరేట్ బాండ్ల సెకండరీ మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు పెరిగేందుకు వీలుగా సెక్యూరిటీల గుర్తింపునకు జారీ చేసే ఐఎస్‌ఐఎన్‌ల(ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ ఐడెంటిఫికేషన్ నంబర్) విషయంలో సెబీ కొత్తగా పరిమితి తీసుకొచ్చింది. బాండ్లను జారీ చేసే కంపెనీకి ఏడాదికి 12 ఐఎస్‌ఎన్‌లను మించి వినియోగించుకోవడానికి లేదు.
బ్రోకర్లకు ఒకటే లైసెన్స్
బ్రోకర్లు, క్లియరింగ్ మెంబర్లు కమోడిటీ డెరివేటివ్‌లు, ఈక్విటీ మార్కెట్లకు వేర్వేరు లైసెన్స్‌ల స్థానంలో సెబీ యూనిఫైడ్ లైసెన్స్ జారీ చేయాలని సెబీ నిర్ణయించింది.
ఐపీవోల్లో మరింత పారదర్శకత
ఐపీవోల్లో క్యూఐబీ (అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లు) కోటాలో పెట్టుబడులకు ఎన్‌బీఎఫ్‌సీలను అనుమతిస్తూ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీవో రూట్లో మరిన్ని పెట్టుబడులకు వీలు కల్పించనట్టయింది. ఆర్‌బీఐ వద్ద నమోదై రూ.500 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకే ఈ అర్హత లభించనుంది.
ఇక పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) పేరిట నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు సెబీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఐపీవోల రూట్‌లో రూ.500 కోట్లకు పైగా నిధులను సేకరించేట్టు అయితే పర్యవేక్షణకు గాను ఒక ఏజెన్సీని (బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ) నియమించాల్సి ఉంది. దీన్ని ఇకపై రూ.100కోట్లకు మించి నిధులు సేకరించే అన్ని ఇష్యూలకు సెబీ అమలు చేయనుంది.
పీ నోట్స్ పటిష్టం
అక్రమ నిధులు పీ నోట్ల మార్గంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు గాను దేశీయులు, ప్రవాస భారతీయులు (రెసిడెంట్, నాన్ రెసిడెంట్) పార్టిసిపేటరీ నోట్లలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధం విధించింది. ఎఫ్‌పీఐ నిబంధనల్లో కొత్త నిబంధన చేర్చనుంది. ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్(ఓడీఐ) వీటినే పీ నోట్లుగా పేర్కొంటారు.