డిజిటల్ వాలెట్స్‌తో ఫండ్స్‌లో పెట్టుబడులు
రూ. 50 వేల దాకా ఇన్వెస్ట్ చేసేందుకు సెబీ వెసులుబాటు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సాధనాలను వినియోగిస్తున్న యువతరానికి పెట్టుబడి సాధనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు రూ. 50,000 దాకా మొత్తాలను డిజిటల్ వాలెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కల్పించింది. మరోవైపు, లిక్విడ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆన్‌లైన్ మాధ్యమంలో తక్షణ ఉపసంహరణ వెసులుబాటు కల్పించాలంటూ మ్యూచువల్ ఫండ్ సంస్థలను సెబీ ఆదేశించింది. విత్‌డ్రాయల్ పరిమితి రూ. 50,000 లేదా ఫోలియో విలువలో 90 శాతంగా (ఏది తక్కువైతే అది) ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు, కుటుంబాల పొదుపు మొత్తాలను క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ–వాలెట్స్ ద్వారా ఇన్వెస్టరు.. ఫండ్ స్కీములో రూ.50,000 దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని, అంతకు మించకుండా చూడాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. పెట్టుబడుల ఉపసంహరించుకున్న పక్షంలో వచ్చే మొత్తాన్ని యూనిట్ హోల్డరు బ్యాంకు ఖాతాకు మాత్రమే బదిలీ చేయాలని పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది. ఇలా తమ ద్వారా ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ–వాలెట్ సంస్థలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ క్యాష్ బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి లేదని స్పష్టం చేసింది.