
ముంబై: కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్స్) మరింత కట్టుదిట్టం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సంస్కరణలకు తెరతీసింది. దీనికి సంబంధించి ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించింది.
అదే విధంగా లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు, స్టార్టప్‌లకు మరిన్ని నిధులు వచ్చేలా చూడటం వంటి పలు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.
80లో 40 సిఫార్సులకు పూర్తిగా ఆమోదం...
కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి కోటక్ కమిటీ మొత్తం 80 సిఫార్సులు చేయగా... వాటిలో 80 శాతాన్ని సెబీ ఆమోదించింది. 40 సిఫార్సులనైతే యథాతథంగా ఆమోదించామని బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ అజయ్ త్యాగి విలేకరులతో చెప్పారు. మరో 15 సిఫార్సులను కొద్ది మార్పులతో ఆమోదించామన్నారు.
ఇక ఎనిమిదింటిని ప్రభుత్వ, ఇతర విభాగాల పరిశీలనకు పంపామని, 18 సిఫార్సులను పక్కనబెట్టామని వెల్లడించారు. కీలక సమాచారాన్ని ప్రమోటర్లు, ముఖ్యమైన ్న షేర్‌హోల్డర్లతో పంచుకునే ప్రతిపాదన వంటివి పక్కనబెట్టినవాటిలో ఉన్నాయి.
సెబీ ఆమోదించిన నిర్ణయాలివీ...
♦ లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును సీఈఓ/ఎండీ, చైర్మన్‌గా విభజించనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఆధారంగా టాప్– 500 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు.
♦ 2019 ఏప్రిల్ 1 కల్లా టాప్–500 లిస్టెడ్ కంపెనీలన్నీ కచ్చితంగా కనీసం ఒక స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను నియమించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి టాప్–1000 లిస్టెడ్ కంపెనీలకు దీన్ని అమలు చేస్తారు.
♦ టాప్–1000 లిస్టెడ్ కంపెనీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి కనీసం ఆరుగురు డైరెక్టర్లు ఉండాలి. 2020 ఏడాది ఏప్రిల్1 నుంచి ఈ నిబంధనను టాప్–2000 లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తారు.
♦ ఒక వ్యక్తి ఎనిమిది లిస్టెడ్ కంపెనీల వరకూ మాత్రమే డైరెక్టర్‌గా ఉండొచ్చుననే నిబంధన ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఏడుకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తి 10 కంపెనీల్లో డైరెక్టర్ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది.
♦ స్వతంత్ర డైరెక్టర్ల అర్హత , ఆడిట్, రెమ్యూనరేషన్ (పారితోషికం), రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీల్లో మరింత పాత్ర ఉండేవిధంగా నిబంధనల్లో మార్పు చేశారు.
లిస్టింగ్ నిబంధనలు కఠినతరం...
స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ మార్చనుంది. ముఖ్యంగా ప్రమోటర్ల వాటాలను ఫ్రీజ్ చేయడం, నిబంధనలను సరిగ్గా పాటించని కంపెనీల షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేయటం వంటి కఠిన చర్యలు ఇందులో ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు కూడా సెబీ కార్యాచరణను ప్రకటించింది. స్టాక్ డెరివేటివ్స్‌లో ఫిజికల్ సెటిల్‌మెంట్‌ను విడతలవారీగా ఒక క్రమపద్ధతిలో అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఎలా వినియోగించారనే సమాచారాన్ని కంపెనీలు ఇకపై కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిటర్ల వివరాలు, వాళ్లకిచ్చే ఫీజు, రాజీనామా చేస్తే దానికి గల కారణాలతో పాటు డైరెక్టర్ల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలన్నీ కంపెనీలు కచ్చితంగా బహిర్గతం చేయాలి.
లిస్టెడ్ కంపెనీలు, వాటికి సంబంధించిన అన్‌లిస్టెడ్ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ కూడా ఇకపై తప్పనిసరి కానుంది. అదేవిధంగా లిస్టెడ్ కంపెనీలన్నీ 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఫలితాలను కచ్చితంగా ప్రకటించాల్సి ఉంటుంది. కంపెనీల విలీనాలు, టేకోవర్ ఒప్పందాల విషయంలో కంపెనీలు తమ ఓపెన్ ఆఫర్ ధరను పెంచేందుకు వీలుగా అదనపు గడువును ఇచ్చేందుకు కూడా సెబీ ఓకే చెప్పింది.
‘దివాలా’ కంపెనీలకు కఠిన నిబంధనలు..!
దివాలా చట్టం (ఐబీసీ) ప్రకారం ఈ ప్రక్రియలో ఉన్న లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నిబంధనలను సవరించాలని సెబీ నిర్ణయించింది. సంబంధిత కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా, ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్, ప్రమోటర్ల పునర్‌విభజన వంటి అంశాల్లో అదనంగా మరింత సమాచారాన్ని వెల్లడించడం వంటివి ఇందులో ఉన్నాయి. బోర్డు సమావేశం తర్వాత దీనికి సంబంధించి చర్చా పత్రాన్ని విడుదల చేసింది.
మొండిబకాయిల సమస్య కారణంగా ఇటీవలి కాలంలో దివాలా చట్టం కింద పరిష్కార కేసులు పెరిగిపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. ఇక కంపెనీలు రుణ బకాయిల చెల్లింపులో విఫలమైతే(డిఫాల్ట్) ఒక్కరోజులోపే(పనిదినం) దీన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించాలని గతంలో విధించిన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్యాగి చెప్పారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చినప్పటికీ బ్యాంకుల అభ్యర్థన మేరకు వెంటనే దీన్ని సెబీ వాయిదా వేసింది.
ఫండ్స్‌లో అదనపు చార్జీలకు కోత..
మ్యూచువల్ ఫండ్ సలహా కమిటీ (ఎంఏఏసీ) సిఫార్సులు, గణాంకాల ఆధారంగా ఎం ఎఫ్ స్కీములపై ఇప్పుడున్న 20 బేసిస్ పాయింట్ల అదనపు చార్జీలను 5 బేసిస్ పాయింట్లకు (గరిష్ట పరిమితి) తగ్గిస్తున్నట్లు సెబీ పేర్కొంది.
ఎంఎఫ్ స్కీములకు సంబంధించి 5 శాతం ఎగ్జిట్ లోడ్‌కు బదులుగా రోజువారీ నికర అసెట్ విలువపై (ఏఎన్‌వీ) 20 బేసిస్ పాయింట్ల వరకూ అదనపు చార్జీలను ఫండ్ సంస్థలు వసూలు చేసేందుకు గతంలో సెబీ అనుమతించింది. అయితే, ఫండ్ ఫథకాలను మరింత మందికి చేరువ చేయడం కోసం ఇప్పుడీ అదనపు చార్జీలో 15 బేసిస్ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించింది. 100 బేసిస్ పాయింట్లను 1%గా లెక్కిస్తారు.
కో–లొకేషన్ ఇక అందరికీ...
స్టాక్ ఎక్సే్ఛంజీలు తమ ట్రేడింగ్ సభ్యులందరికీ కో–లొకేషన్ సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సెబీ స్పష్టం చేసింది. అదేవిధంగా కొన్ని సేవలను ఉచితంగా కూడా అందించాలని పేర్కొంది. ఎక్సే్ఛంజీలు కల్పిస్తున్న కో–లొకేషన్ సదుపాయం వల్ల ట్రేడింగ్ డేటా వేగంగా ట్రాన్స్‌ఫర్ అయ్యే వీలుంటుంది. నాన్ కో–లొకేటర్ సభ్యులకు (బ్రోకరేజీ సంస్థలు) ఈ అవకాశం లేదు.
కో–లొకేషన్ సేవల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో (సర్వర్ల వాడకం, ఇతరత్రా చార్జీలు) చిన్న బ్రోకరేజీ సంస్థలకు ఇది అందుబాటులో లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇకపై కో–లొకేషన్ సదుపాయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలే ఏర్పాటు చేసి... దీన్ని సభ్యులందరికీ షేరింగ్ పద్ధతిలో అందించాలని సెబీ స్పష్టంచేసింది. దీనివల్ల వ్యయం 90%పైగానే తగ్గుతుందని అంచనా.
తద్వారా మరిన్ని బ్రోకరేజీ సంస్థలు దీన్ని వినియోగించుకుని ట్రేడింగ్ వ్యవస్థలో డేటా ట్రాన్స్‌ఫర్ వేగంలో జాప్యాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఆల్గోరిథమ్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంబంధిత సాఫ్ట్‌వేర్ ఉపయోగించే సంస్థలు దీన్ని పరీక్షించుకోవడం కోసం సిమ్యులేటెడ్ మార్కెట్ పరిస్థితులను అందుబాటులో ఉంచాలని సెబీ పేర్కొంది.
స్టార్టప్‌లకు బూస్ట్...
దేశంలో ఆరంభస్థాయిలో ఉన్న స్టార్టప్‌లకు మరింత ఊతమిచ్చేలా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సంబంధించిన స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) పెట్టుబడి నిధుల గరిష్ట పరిమితిని ఇప్పుడున్న రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఐఎఫ్ నిబంధనలకు సవరణలను ఆమోదించింది. కనీస పెట్టుబడి పరిమితి మాత్రం ఇప్పుడున్న రూ.25 లక్షలుగానే కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment