పదేళ్ల ఐపీఓ స్కామ్‌పై సెబీ మళ్లీ విచారణ
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల క్రితం నాటి ఐపీఓ స్కామ్‌పై మళ్లీ దర్యాప్తు జరపాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఐడీఎఫ్‌సీ, సాస్కేన్, సుజ్లాన్ కంపెనీల ఐపీఓలకు సంబంధించి జీలస్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రయిటర్ జయేశ్ పి. ఖండాల్వా పాత్రపై ఈ దర్యాప్తు జరగనున్నది. ఈ ఐపీఓల డీమ్యాట్ స్కామ్ ద్వారా భారీగా ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు వచ్చాయి. కాగా మొదటగా ఈ విషయం 2005 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది.
ఈ ఐపీఓకు సంబంధించి వివిధ నిబంధన ఉల్లంఘన జరిగిందని, వివిధ వ్యక్తుల సంబంధాల మధ్య తాజాగా దర్యాప్తు జరపాలని నిర్ణయించామని సెబీ పూర్తి కాల సభ్యుడు ప్రశాంత్ సరన్ పేర్కొన్నారు. ఖండ్వాలా బినామీ పేర్లతో వేలాది డీమ్యాట్ అకౌంట్ల ద్వారా షేర్లు పొంది వాటి ద్వారా లాభపడ్డాడని సెబీ ప్రాథమికంగా నిర్ధారించింది. రిటైల్ కేటగిరిలో షేర్లను పొందేందుకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఆపరేటర్లకు ఖండ్వాలా సొమ్ములిచ్చాడని సెబీ కనుగొన్నది. ఇలా పొందిన షేర్లను ఆ ఆపరేటర్లు ఖండ్వాలకు బదిలీ చేశారని, వాటిని ఆయన విక్రయించి చట్టవిరుద్ధంగా లాభాలను ఆర్జించారని ఆ దర్యాప్తులో తేలింది.