ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు కఠినతరం
ముంబై: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరోసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా డీలిస్టింగ్‌కు తాజా నిబంధనలు ప్రకటించడంతోపాటు దాదాపు రెండు దశాబ్దాల కాలంనాటి ఇన్‌సైడర్ నియంత్రణలను సంస్కరించే బాటలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ అంశంలో స్పష్టతనిస్తూ ఇన్‌సైడర్లకు అర్థాన్ని విసృ్తతం చేసింది.
అంతేకాకుండా వీటివల్ల చట్టబద్ధ బిజినెస్ లావాదేవీలకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా ఒక కంపెనీకి చెందిన ఒప్పందాలు, విశ్వాసపాత్రులు, కీలక ఉద్యోగ సంబంధాలు వంటి అంశాలకు సంబంధించిన బయటకు వెల్లడించని సమాచారాన్ని తెలుసుకోగలిగిన వ్యక్తులను ఇన్‌సైడర్లుగా సెబీ వ్యక్తీకరించింది. సంబంధిత కంపెనీ షేరు ధర ప్రభావితమయ్యే ఇలాంటి సమాచారాన్ని అందుకోగలిగిన వ్యక్తులను ఇన్‌సైడర్లుగా పేర్కొంది.
అయితే వీరికి దగ్గరి బంధువులు, తదితర సంబంధీకులు ఇన్‌సైడర్ సమాచారాన్ని పొందలేదన్న విషయంలో తమ నిజాయితీని నిరూపించుకోవాలని సెబీ తెలిపింది. లేనిపక్షంలో వీరు కూడా ఇన్‌సైడర్లకిందకు వస్తారని తెలిపింది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. బుధవారం సమావేశమైన బోర్డు సమావేశంలో తాజా నిబంధనలను ఆమోదించింది.
కనీసం 25% ఓకే అంటేనే: మొత్తం విధానాలు ప్రతిబంధకంగా నిలవకుండా సెబీ కొన్ని నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలు డీలిస్టింగ్ కావడానికి పట్టే సమయాన్ని సగానికి కుదించింది. ఇందుకు ప్రస్తుతం 137 రోజుల సమయం పడుతుండగా, ఇకపై 76 రోజులకు పరిమితంకానుంది. రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంలో కనీసం 25% వాటాదారులు పాల్గొంటే డీలిస్టింగ్ విజయవంతంకానుంది. ఇన్‌సైడర్ నిబంధనలకు సంబంధించి అంతర్జాతీయ చట్టాలతో అనుసంధానం చేయనుంది. విల్‌ఫుల్ డిఫాల్టర్స్‌గా ముద్రపడిన కంపెనీలు, ప్రమోటర్లు, డెరైక్టర్లు క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించకుండా నిబంధనల్లో మార్పు చేసింది.
రెండు పథకాలకే చాన్స్
మ్యూచువల్ ఫండ్ కంపెనీల కనీస నెట్‌వర్త్‌ను రూ. 10 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచింది. ఇందుకు మూడేళ్ల కాలాన్ని గడువుగా సెబీ ప్రకటించింది. కనీసం రూ. 50 కోట్ల నెట్‌వర్త్‌ను అందుకోని ఫండ్ హౌస్‌లు ఏడాదికి గరిష్టంగా 2 పథకాలనే ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది.