సెక్యూరిటీ ఆందోళనలను పరిష్కరిస్తాం: షియోమి
న్యూఢిల్లీ: తమ మొబైల్ ఫోన్ వినియోగదారుల నుంచి అనుమతి లేకుం డా ఎలాంటి డేటాను సేకరించటం లేదని చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి స్పష్టం చేసింది. యూజర్ల డేటా భద్రత విషయంలో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు సంబంధిత భారతీయ ప్రభుత్వ సంస్థలను సంప్రదించనున్నట్లు కంపెనీ వివరించింది. షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్‌లను తమ అధికారులు, కుటుం బీకులు వాడొద్దంటూ గత వారం భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా ఈ ఫోన్‌లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ అంటోంది. షియోమి భారత్‌లో ప్రవేశపెట్టిన ఎంఐ3, రెడ్‌మి 1ఎస్ ఫోన్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇతర దేశాల(చైనాయేతర) కస్టమర్లకు సంబంధించి డేటాను అమెరికా, సింగపూర్ డేటా సెంటర్లకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని షియోమీ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బర్రా చెప్పారు.