జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్‌  | Selling of shares in public sector companies | Sakshi
Sakshi News home page

జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్‌ 

Sep 8 2018 1:11 AM | Updated on Sep 8 2018 1:11 AM

Selling of shares in public sector companies - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్‌) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో (సీఈఎల్‌) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్‌ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి కనీసం రూ. 50 కోట్ల నికర విలువ గల సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. 1974లో ఏర్పాటైన సీఈఎల్‌ ప్రస్తుతం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహణలో ఉంది. 2017 మార్చి ఆఖరు నాటి లెక్కల ప్రకారం దీని నికర విలువ రూ.50.34 కోట్లు. గతేడాదే ఈ సంస్థ విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా భారత్‌–22 ఈటీఎఫ్, రైట్స్‌ సంస్థలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 9,000 కోట్లు సమీకరించింది.  

రూ. 467 కోట్ల ఇర్కాన్‌ ఐపీవో.. 
రైల్వేస్‌ అనుబంధ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌లో 10 శాతం వాటాల విక్రయంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రూ. 467 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఇనీ షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీవో) సంబంధించి ధర శ్రేణిని రూ. 470– రూ. 475గా ఇర్కాన్‌ నిర్ణయించింది. ఈ ఐపీవోలో కేంద్రం 99,05,157 షేర్లను విక్రయిస్తోంది. సెప్టెంబర్‌ 17న ప్రారంభమయ్యే ఐపీవో 19న ముగుస్తుంది. షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేస్తారు. 1976లో ప్రారంభమైన ఇర్కాన్‌..  రైల్వేస్, హైవేలు, వంతెనలు మొదలైన మౌలిక రంగ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. సంస్థకు రూ. 22,406 కోట్ల మేర ఆర్డర్లున్నాయి.  ఈ ఏడాది జూన్‌లోనే రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్‌ కూడా ఐపీవోకి వచ్చింది.  

ఏఐఏటీఎస్‌ఎల్‌లో వాటాల అమ్మకం .. 
రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించే ప్రణాళికల్లో భాగంగా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌(ఏఐఏటీఎస్‌ఎల్‌)లో వ్యూహాత్మక వాటాల విక్రయ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. మంత్రుల బృందం(జీవోఎ) అనుమతులు వచ్చాక బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను(ఈవోఐ) ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement