రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న రిలయన్స్
ఫ్లాట్‌గా ట్రేడవుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మరలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో షేర్లు మద్దతుతో సెన్సెక్స్ 119.15 పాయింట్లు లాభాల్లోకి ఎగిసి 32,023 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 9,904 వద్ద ట్రేడవుతున్నాయి.
ముంబై : ఫ్లాట్‌గా ట్రేడవుతూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మరలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో షేర్లు మద్దతుతో సెన్సెక్స్ 119.15 పాయింట్లు లాభాల్లోకి ఎగిసి 32,023 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 9,904 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. గురువారం మార్కెట్ అవర్స్ తర్వాత ప్రకటించిన అదరగొట్టే లాభాలు, నేటి ఏజీఎంలో ఫీచర్ ఫోన్ వివరాలు ఈ కంపెనీ షేర్లకు బూస్ట్ ఇచ్చాయి.
3.9 శాతం మేర పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు, తొమ్మిదన్నర ఏళ్ల గరిష్టంలో రూ.1,588 వద్ద నమోదవుతున్నాయి. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌చేసిన ముఖేష్ అంబానీ, ఈ డివైజ్‌తో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగాదారులకు డేటా సేవలను మరింత దగ్గర చేయనున్నామని చెప్పారు. అంతేకాక తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులను జియో సర్వీసుల్లోకి మారేలా ఈ ఫీచర్ ఫోన్ దోహదం చేస్తుందని తెలిపారు.
ఆయిల్ నుంచి టెలికాం వరకు మార్కెట్‌లో తన హవా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లోనూ విశ్లేషకుల అంచనాలను మించింది. రూ.9,108 కోట్ల రికార్డుస్థాయి కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. ఇవన్నీ నేటి మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకుపోవడానికి సహకరిస్తున్నాయి. 2008 జనవరి తర్వాత ఇవే అత్యధిక గరిష్టస్థాయిలు. మరోవైపు టెలికాం దిగ్గజాలు జియో ఫీచర్ ఎఫెక్ట్‌కు భారీగా కుప్పకూలాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌లు 4.1 శాతం, 7.3 శాతం కిందకి పడిపోయాయి.