
ముంబై: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా... శుక్రవారం దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రధానంగా ఇండెక్స్‌లోని బడా షేర్లవైపే మొగ్గు చూపడంతో చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ సుమారు 13 పాయింట్లు పెరిగి 36,387 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1.75 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్ 379 పాయింట్లు (సుమారు 1 శాతం), నిఫ్టీ 112 పాయింట్లు (దాదాపు 1 శాతం) మేర పెరిగాయి. ఫార్మా షేర్లు, బలహీన రూపాయి తదితర అంశాలు సెంటిమెంట్‌కి ప్రతికూలంగా మారాయని, అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నా దేశీ మార్కెట్లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చి విభాగం) వినోద్ నాయర్ తెలిపారు.
అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, మళ్లీ మాంద్యం భయాల కారణంగా సమీప భవిష్యత్‌లో భారత మార్కెట్లు స్థిర శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్స్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, టీసీఎస్ దాదాపు 1.41 శాతం దాకా లాభపడ్డాయి. ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాŠంక్, యస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ మొదలైనవి కూడా అదే బాటలో 6.42 శాతం దాకా క్షీణించాయి.
రిలయన్స్ జూమ్...
క్యూ3లో రికార్డు స్థాయిలో రూ. 10,000 కోట్ల పైగా నికర లాభాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సెన్సెక్స్‌లో అత్యధికంగా 4.34 శాతం లాభపడి రూ. 1,183 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 4.89 శాతం ఎగిసి రూ. 1,185.50 స్థాయిని కూడా తాకింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఒక్కరోజులోనే రూ. 31,209 కోట్లు పెరిగి రూ. 7,49,830 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment