ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ‘జై’ కొట్టడంతో సోమవారం స్టాక్ సూచీలు ఏకంగా రెండు శాతం ర్యాలీ చేశాయి. ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదు ఉత్సాహాన్నిచ్చాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గుముఖం పట్టాయి.
బ్రెంట్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు దిగువకు చేరుకుంది. ఫలితంగా సూచీలు 18 నెలల్లో (మే 20, 2022 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,384 పాయింట్లు పెరిగి 68,865 ముగిసింది. నిఫ్టీ 419 పాయింట్లు బలపడి 20,687 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ట ముగింపు.
ట్రేడింగ్‌లోనూ జీవితకాల గరిష్టాల నమోదు
జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 945 పాయింట్లు పెరిగి 68,435 వద్ద, నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 20,602 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. మీడియా తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు స్థిరమైన లాభాలతో ట్రేడయ్యా యి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడం ఓ దశలో సెన్సెక్స్ 1,437 పాయి ంట్లు దూసుకెళ్లి 53 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 68,918 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు
చేసింది. నిఫ్టీ 435 పాయింట్లు ఎగసి 20,703 వద్ద రెండో రోజూ రికార్డు ర్యాలీ చేసింది.
► సూచీల రికార్డు ర్యాలీని అందిపుచ్చుకున్న అదానీ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 9%, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 7%, అదానీ పోర్ట్స్, ఏసీసీ 6%, అదానీ పవర్, అదానీ ఎనర్జీ 5%, అదానీ టోటల్ గ్యాస్ 4%, ఎన్‌డీటీవీ 3%, అదానీ విల్మార్ 2% చొప్పున లాభపడ్డాయి. మొత్తం పది కంపెనీల షేర్లూ రాణించడంతో ఇంట్రాడేలో గ్రూప్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 31 తర్వాత తొలిసారి రూ.12 లక్షల కోట్లను తాకింది. చివరికి రూ.11.95 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
►ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఐసీఐసీఐ బ్యాంక్ 5%, ఎస్‌బీఐ 4%, కోటక్ బ్యాంక్, పీఎన్‌బీ, ఇండస్ ఇండ్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 3% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఏ యూ బ్యాంక్‌లు 2%, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు ఒకశాతం పెరిగాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ 91 ట్రేడింగ్ సెషన్ల తర్వాత 46,484 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది.
ఆల్‌టైం హైకి ఇన్వెస్టర్ల సంపద
సెన్సెక్స్ రెండుశాతం ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.81 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ. 343.48 లక్షల కోట్లకు చేరింది. కాగా అయిదు రోజుల ర్యాలీతో బీఎస్‌ఈలో రూ.14.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్వసించాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థూల ఆర్థిక అంశాలు మెప్పించడంతో రానున్న రోజుల్లో ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు కొనసాగొచ్చు. రికార్డు ర్యాలీ నేపథ్యంలో స్థిరీకరణ జరిగితే నిఫ్టీకి 20,400 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment