
అమ్మకాల వెల్లువ.. 263 పాయింట్లు డౌన్
ఏడో రోజూ నష్టాలు...
• నోట్ల రద్దుతో కంపెనీల ఫలితాలపై ప్రభావం
• 26వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్..
• ఏడు రోజుల్లో సెన్సెక్స్ నష్టాలు 718 పాయింట్లు
• 8,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
• 82 పాయింట్ల నష్టంతో 7,979 వద్ద ముగింపు
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే ఆందోళనతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువ కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ కీలకమైన 26వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. స్టాక్ సూచీలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలపాలయ్యాయి. గత ఏడాది మార్చి తర్వాత.. అంటే ఏడాదిన్నర కాలం తర్వాత సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి.
సెన్సెక్స్ 263 పాయింట్లు(1 శాతం) నష్టపోయి 25,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,979 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలకు ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ నష్టపోయింది. లోహ, మౌలిక, కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్, ఆయిల్, గ్యాస్... అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఈ ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 718 పాయింట్లు నష్టపోయింది.
పతనానికి పలు కారణాలు....
అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగియడం, ఇటలీ బ్యాంకింగ్ రంగం కష్టాల్లో ఉండడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. గురువారంప్రారంభమైన రెండు రోజుల జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశ ఫలితం కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌లో ఆచితూచి వ్యవహరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే ఆందోళన, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల పెట్టుబడులు నవంబర్‌లో మూడేళ్ల కనిష్ట స్థాయికి, రూ.1.79 లక్షల కోట్లకు పడిపోవడం, క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల సీజన్ సందర్భంగా లావాదేవీలు తక్కువగా చోటు చేసుకోవడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మూడు సార్లు రేట్లు పెంచుతుందన్న అంచనాలతొ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు..
30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు నష్టపోయాయి. కేవలం మూడు షేర్లు... ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి. హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ షేర్లు 3–4 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1,995 షేర్లు నష్టపోగా, 655 షేర్లు లాభాల్లో ముగిశాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం...
నగదు కొరత కారణంగా సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావమే ఉంటుందని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నొముర వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ అంచనాల కంటే అధికంగానే ఆర్థిక వ్యవస్థకు డ్యామేజ్ జరుగుతుందని పేర్కొంది. నగదు కొరత సమస్య వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.