‘ఫెడ్’ భయాలతో... | Sensex closes points down | Sakshi
Sakshi News home page

‘ఫెడ్’ భయాలతో...

Published Sat, Sep 5 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

‘ఫెడ్’ భయాలతో...

‘ఫెడ్’ భయాలతో...

సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.92 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.93,83,643కు పడిపోయింది.
 
సెన్సెక్స్ 563 పాయింట్లు డౌన్; 25,202 వద్ద ముగింపు
- అమెరికా ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో అమ్మకాల వెల్లువ
- 168 పాయింట్ల క్షీణతతో 7,655కు నిఫ్టీ
- వరుసగా నాలుగో వారమూ నష్టాల్లోనే..

స్టాక్‌మార్కెట్‌ను నష్టాలు వదలడం లేదు. అప్పుడప్పుడు కొంచెం పెరుగుతున్నా... అంతలోనే బేర్ మంటోంది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో శుక్రవారం సైతం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు కీలకంగా భావించే ఉద్యోగాల గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో... ఆసియా, యూరోప్ మార్కెట్లు నష్టాల పాలవడం మన స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 562 పాయింట్లు (2.18 శాతం) నష్టపోయి 25,202 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168 పాయింట్లు (2.15 శాతం) క్షీణించి 7,655 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు 14 నెలల్లో ఇదే అత్యంత బలహీనమైన ముగింపు. అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి.
 
అమ్మకాల వెల్లువ...
అమెరికా పేరోల్స్ డేటా నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. రేట్ల పెంపుకు దోహదం చేసే విధంగానే  ఈ గణాంకాలు ఉండొచ్చనే అంచనాలతో స్టాక్‌మార్కెట్లో అమ్మకాలు పోటెత్తాయి. రూపాయి పతనం కూడా ప్రభావం చూపింది. వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తుండడం వల్ల వ్యవసాయ దిగుబడులు తక్కువ స్థాయిలో ఉంటాయన్న ఆందోళన అమ్మకాల ఒత్తిడిని మరింతగా పెంచింది. రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి.

ఇన్‌ఫ్రా, విద్యుత్తు, బ్యాంక్, ఫార్మా షేర్ల నష్టాల పాలయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, అమెరికా ఫెరడల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు... ఈ రెండంశాలూ స్టాక్ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు. అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనతో విదేశీ నిధులు తరలిపోతున్నాయని వారంటున్నారు. సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,119 పాయింట్ల కనిష్ట స్థాయిని (గురువారం ముగింపుతో పోల్చితే 646 పాయింట్ల నష్టం) తాకింది. చివరకు 563 పాయింట్ల నష్టంతో 25,202  పాయింట్ల వద్ద ముగిసింది.
 
నాలుగేళ్లలో ఇదే  దారుణమైన ‘వీక్’
ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 1,190 పాయింట్లు (4.5 శాతం), నిఫ్టీ 347 పాయింట్లు (4.33 శాతం) చొప్పున నష్టపోయాయి. ఒక వారంలో సూచీలు ఇంతలా పతనం కావటం గడిచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో వారమూ నష్టాల్లోనే ముగిసింది. ఒక్క నెలరోజుల కాలంలోనే సెన్సెక్స్ 10 శాతం వరకూ పతనమైంది. చైనా దేశం తన కరెన్సీ విలువను తగ్గించిన గత నెల 11 నుంచి చూస్తే సెన్సెక్స్ సుమారుగా 2,900 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 16 శాతం పడిపోయింది.
 
కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల విక్రయాలు
విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.1,287 కోట్ల మేర నికర విక్రయాలు జరిపారు. సెప్టెంబర్‌లో ట్రేడింగ్ జరిగిన నాలుగు రోజుల్లో ఎఫ్‌ఐఐలు రూ.4,000 కోట్ల నికర అమ్మకాలు జరపడం విశేషం. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విషయమై ప్రభుత్వం ఊరటనిచ్చినా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు ఆగలేదు. కాగా గత నెలలో ఎఫ్‌ఐఐలు రూ.17,000 కోట్లకు పైగా నికర అమ్మకాలు జరిపారు.
 
రెండు సెన్సెక్స్ షేర్లకే లాభాలు...
30 సెన్సెక్స్ షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. వేదాంత అధికంగా నష్టపోయింది. వేదాంత, హిందాల్కో, గెయిల్, టాటా స్టీల్ 4-5 శాతం రేంజ్‌లో పడిపోయాయి. బేస్ రేట్ గణనకు సంబంధించి ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల వల్ల బ్యాంక్‌ల లాభదాయకత దెబ్బతింటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐలు 2-3.5 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ఆ షేర్లు 2 శాతం వరకూ క్షీణించాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కంపెనీలు 2-3 శాతం రేంజ్‌లో పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,287 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,129 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
 
ప్రపంచ మార్కెట్లు ఇలా...
జపాన్ నికాయ్ 2.1 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 0.45 శాతం చొప్పున పడిపోయాయి. అన్ని ఆసియా మార్కెట్లు నష్టాలపాలయ్యాయి.  సెలవుల కారణంగా  చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ పనిచేయలేదు. యూరోప్ మార్కెట్లు కూడా 2-3 శాతం మేర కూడా భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్ల విషయానికొస్తే.. డోజోన్స్ సూచీ 300 పాయింట్లు, నాస్‌డాక్ ఇండెక్స్ 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి.
 
అయోమయంగా ఉద్యోగ గణాంకాలు
శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం అగస్టులో అమెరికాలో 1,73,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగం రేటు 5.1%కి తగ్గింది. నిపుణులు 2,20,000 ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగం 5.2%కి తగ్గుతుందని అంచనా వేశారు. అంచనాల కంటే తక్కువగానే కొత్త ఉద్యోగాలు, మరోవైపు నిరుద్యోగం తగ్గడం అందర్నీ అయోమయంలో పడేసింది.  ఈ నెల 16-17న జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీరేట్ల పెంపు నిర్ణయానికి ఈ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ గణాంకాలు మిశ్రమంగా వెలువడడంతో ఫెడ్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి, అయోమయం  ఇన్వెస్టర్లలో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement