4 రోజుల్లో 419 పాయింట్లు
ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా నిలవడం, విదేశీ సానుకూలతలు దేశీ స్టాక్ మార్కెట్లకు మరోసారి జోష్‌నిచ్చాయి. దీంతో తొలి నుంచీ లాభాల్లో కదిలిన సెన్సెక్స్ చివరకు 133 పాయింట్లు జమ చేసుకుని 21,120 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 38 పాయింట్లు బలపడి 6,277 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు రోజుల్లోనే 419 పాయింట్లు లాభపడ్డాయి. తద్వారా 5 వారా ల గరిష్ట స్థాయికి చేరాయి. అంతేకాకుండా 2013 నవంబర్ తరువాత ఒక వారంలో ఉత్తమ పనితీరును ప్రదర్శించాయి. గడిచిన మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ. 1,200 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 592 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గురువారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయకపోవడంతో ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమైంది.
హెల్త్‌కేర్ జోష్...
బీఎస్‌ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్, ఐటీ, ఆటో రంగాలు 2-1% మధ్య లాభపడ్డాయి. ఫార్మా దిగ్గజాలలో సన్, సిప్లా, గ్లెన్‌మార్క్, వోకార్డ్ 2.5-4% మధ్య పుంజుకోగా, ఇంట్రాడేలో క్యాడిలా(రూ. 1,053), లుపిన్(రూ. 1,001), డాక్టర్ రెడ్డీస్(రూ. 2,940), అరబిందో(రూ. 540), అజంతా(రూ. 1,065) కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో 4% చొప్పున ఎగసిన టాటా మోటార్స్(రూ.417), టీసీఎస్(రూ. 2,273) సైతం చరిత్రాత్మక గరిష్టాలను చేరాయి. ఈ బాటలో హిందాల్కో దాదాపు 7% దూసుకెళ్లగా, భెల్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ 3-2.5% మధ్య వృద్ధి చూపాయి.
మారుతీ రివర్స్‌గేర్...
గుజరాత్ ప్లాంట్‌పై ఇన్వెస్టర్లలో చెలరేగిన ఆందోళనలతో మారుతీ షేరు 4.5% పతనమై రూ. 1,586 వద్ద ముగిసింది. అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన కార్ల ప్లాంట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు బదిలీ చేయడంపై మారుతీ ఇచ్చిన వివరణ ఇన్వెస్టర్లలో ఆందోళనలను తగ్గించలేకపోయిందని, దీంతో మారుతీ షేరులో అమ్మకాలు పెరిగాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక సీఈఆర్‌సీ నిబంధనల కారణంగా ఎన్‌టీపీసీ మరో 2.5% నష్టపోగా, మనీలాండరింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణల నేపథ్యంలో 1% తగ్గిన ఆర్‌ఐఎల్ రూ. 799 వద్ద నిలిచింది. ఇది ఆరు నెలల కనిష్టం.
చిన్న షేర్ల జోరు
మిడ్ క్యాప్స్‌లో ఇండొకో, టాటా ఎలక్సీ, జేపీ పవర్, మోన్‌శాంటో, ఆస్ట్రాజెనెకా, హెచ్‌టీ మీడియా, కావేరీ సీడ్, జూబిలెంట్ లైఫ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, పీఎఫ్‌సీ, గల్ఫ్ ఆయిల్, బీఏఎస్‌ఎఫ్ 14-6% మధ్య దూసుకెళ్లాయి.