దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా నిన్న వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు రేట్ల కోతకు సానుకూలంగా రావడంతో ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు మరోసారి ఆల్‌టైమ్ హైలో ముగిశాయి.
తొలిసారి 32వేలకు పైన సెన్సెక్స్
Published Thu, Jul 13 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
ముంబై : దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా నిన్న వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు రేట్ల కోతకు సానుకూలంగా రావడంతో ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు మరోసారి ఆల్‌టైమ్ హైలో ముగిశాయి. సెన్సెక్స్ మొదటిసారి 32 మార్కును చేధించి 232.56 పాయింట్ల లాభంలో 32,037 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 75.60 పాయింట్ల జోరుతో మొదటిసారి 9,900 మార్కుకు దగ్గర్లో సెటిల్ అయింది. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకులు షేర్లు దేశీయ సూచీలకు రికార్డుల మోత మోగిస్తున్నాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.92 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకులు 1.05 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసు 1.02 శాతం లాభాలు పండించాయి. నేటి మార్కెట్లో ఐటీసీ, భారతీఎయిర్‌టెల్, యస్ బ్యాంకులు ఎక్కువగా లాభపడగా.. ఓఎన్‌జీసీ, ఆసియన్ పేయింట్స్, ఐఓసీ నష్టాలు గడించాయి.
నిన్న వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. దీంతో వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ నిర్వహించనున్న ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రేట్ల కోత చేపడుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలతో పాటు మార్కెట్లు కూడా గతకొన్నిరోజులుగా రికార్డుల మోతమోగించడం నేడు మరింత సహకరించింది. చారిత్రాత్మక 10వేల మార్కును నిఫ్టీ వచ్చే సెషన్‌లలో తాకవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు లాభపడి 64.45గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 61 రూపాయల లాభంలో 27,912 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement
Advertisement