
స్టాక్ మార్కెట్లో రికార్డ్ లాభాలు బుధవారం కూడా కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. ఈ రెండు సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ వరుసగా రెండో రోజూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పాయి. తొలిసారిగా సెన్సెక్స్ 41,500 పాయింట్లు, నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువన ముగిశాయి.
ఇంట్రాడేలో 41,615 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 206 పాయింట్ల లాభంతో 41,559 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 12,238 పాయింట్ల ఆల్‌టైమ్ హైను తాకి చివరకు 57 పాయింట్ల లాభంతో 12,222 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల లాభాలకు కళ్లెం పడింది. లోహ, ఐటీ, ఫార్మా, రియల్టీ, కన్సూమర్ రంగ షేర్లు లాభపడగా, ప్రభుత్వ రంగ, టెలికం, ఆయిల్, గ్యాస్ షేర్లు నష్టపోయాయి.
జోరుగా కొనుగోళ్లు....
ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలను తీసుకుంటుందన్న అంచనాలు, ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని నిపుణులంటున్నారు. బుధవారం జీఎస్‌టీ మండలి సమావేశం జరగ్గా... మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కానీ శ్లాబ్‌లను మార్చే అవకాశాలు లేవన్న వార్తలతో మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ఆర్డర్లు పెరుగుతాయనే అంచనాలతో లోహ, ఐటీ షేర్లు పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
త్వరలో రొసారి బయోటెక్ ఐపీఓ!
ప్రత్యేక రసాయనాలు తయారు చేసే రొసారి బయోటెక్ కంపెనీ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను సెబీకి సమర్పించింది. రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సైజు రూ.700 కోట్లు మేర ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment