ఆటో షేర్ల ర్యాలీ
♦ సెన్సెక్స్ 109 పాయింట్లు అప్
♦ 8,800 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: ఒక రోజు విరామం అనంతరం మార్కెట్ అప్‌ట్రెండ్ పునర్‌ప్రారంభమయ్యింది. ఆటో మొబైల్ షేర్లు ర్యాలీ జరపడంతో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 16 నెలల గరిష్టస్థాయి 28,532 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి 8,800 స్థాయిపైన స్థిరపడలేకపోతున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఎట్టకేలకు ఆ శిఖరంపైన పాగా వేసింది. 35 పాయింట్లు ఎగిసి 8,810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ 237 పాయింట్ల చొప్పున పెరిగాయని, గత 2 నెలల్లో ఒకేవారంలో సూచీలు ఇంతగా పెరగడం ఇదే ప్రధమమని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు.
అమెరికా జాబ్స్ డేటాతో జాగ్రత్త
అమెరికాలో జాబ్స్ డేటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో ర్యాలీ పరిమితంగానే వుందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రభావం చూపే జాబ్స్ డేటా మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడింది. ఆగస్టు నెలలో కొత్తగా 1,80,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నది మార్కెట్ అంచనా కాగా, 1,60,000 మందికి మాత్రమే ఉపాధి లభించినట్లు తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. దాంతో రేట్లు ఈ సెప్టెంబర్ సమావేశంలో రేట్లు పెరగకపోవొచ్చన్న అంచనాలు ఏర్పడటంతో యూరప్ మార్కెట్లు 2 శాతం పెరిగాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ట్రేడవుతోంది. ఆటో మొబైల్ షేర్లలో మారుతి సుజుకి అధికంగా 2 శాతం ఎగిసి రూ. 5,158 వద్ద ముగిసింది.