ముగింపులో అమ్మకాలు
♦ గరిష్టస్థాయి నుంచి తగ్గిన సూచీలు
♦ ఫెడ్ పాలసీపై దృష్టి
ముంబై: సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావానికి తోడు మే నెలలో ద్రవ్యోల్బణం 2.18 శాతానికి తగ్గడంతో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు అరశాతం వరకూ ర్యాలీ జరిపాయి. అయితే మరో రోజులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో జాగ్రత్త వహించిన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ముగింపులో అమ్మకాలు జరపడంతో సూచీలు వాటి తొలి లాభాల్ని పూర్తిగా కోల్పోయాయి. దాదాపు 166 పాయింట్ల పెరుగుదలతో 31,261 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 8 పాయింట్ల స్వల్పలాభంతో 31,103 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,654 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత..అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో ట్రేడింగ్ ముగింపులో 9,600 పాయింట్లస్థాయి దిగువకు జారిపోయింది. చివరకు 9 పాయింట్ల నష్టంతో 9,607 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బుధవారంనాటి ఫెడ్ సమీక్షా సమావేశంలో పావుశాతం వడ్డీ రేట్లు పెంచుతారన్న అంచనాలు వున్నాయని, దాంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం అప్...
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ, దాని బ్యాంకింగ్ సబ్సిడరీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు కొత్త రికార్డుస్థాయిని నమోదు చేశాయి. ఇంట్రాడేలో రూ. 1,682 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయికి చేరిన హెచ్‌డీఎఫ్‌సీ చివరకు 1 శాతంపైగా లాభంతో రూ. 1,668 వద్ద ముగిసింది. అలాగే రూ. 1,692 నూతన రికార్డుస్థాయికి చేరిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చివరకు స్వల్పలాభంతో రూ.1,679 వద్ద క్లోజయ్యింది. పవర్‌గ్రిడ్, లుపిన్, ఎన్‌టీపీసీ, అదాని పోర్ట్స్ షేర్లు పెరగ్గా, టాటా మోటార్స్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు తగ్గాయి.
ఆర్‌ఐఎల్‌ను మించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...
మార్కెట్ విలువలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసేటప్పటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.31,471 కోట్లుకాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 4,26,783 కోట్లు. బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 0.63 శాతం ఎగిసి రూ. 1,679 వద్ద ముగియగా, రిలయన్స్ షేరు 0.51 శాతం క్షీణించి రూ. 1,312 వద్ద క్లోజయ్యింది. కాగా మార్కెట్లో ప్రస్తుతం అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ వుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4,83,425 కోట్లు. తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ (రూ. 3,70,130 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ. 2,65,178 కోట్లు)వున్నాయి.