ప్రపంచదేశాలకు అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి త్వరలో వ్యాక్సిన్ వెలువడగలదన్న అంచనాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 511 పాయింట్లు జంప్‌చేసింది. 38,000 పాయింట్ల సమీపంలో 37,930 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 37,990 వరకూఎగసింది. ఇక నిఫ్టీ 11,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 140 పాయింట్లు జమ చేసుకుని 11,162 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలవద్దే మార్కెట్లు నిలవడం గమనార్హం!
కారణమేవిటంటే?
బ్రిటిష్ యూనివర్శిటీ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంచుతున్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో సోమవారం యూఎస్ మార్కెట్లు లాభపడగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 0.5-2 శాతం మధ్య ఎగశాయి. ఇది దేశీయంగానూ ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్‌తో కూడిన బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ రంగాలు 2 శాతం చొప్పున పుంజుకోగా.. ఆటో 1.6 శాతం ఎగసింది. అయితే ఫార్మా 1.3 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.7 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, ఐవోసీ, బీపీసీఎల్, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, మారుతీ, గెయిల్, కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్ 6.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, ఇన్‌ఫ్రాటెల్, సిప్లా, ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం 4-1 శాతం మధ్య డీలాపడ్డాయి.
పిరమల్ జూమ్
డెరివేటివ్స్ కౌంటర్లలో పిరమల్ 10 శాతం దూసుకెళ్లగా.. అంబుజా సిమెంట్, ఎస్కార్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ 5-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా 7.7 శాతం పతనంకాగా.. హావెల్స్, టాటా కన్జూమర్, ఇంద్రప్రస్థ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, పిడిలైట్, అరబిందో ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్ 3.4-2.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అదే స్థాయిలో పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1442 లాభపడితే.. 1244 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 697 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 209 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment