
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అసలైన ఫలితాలు రావడానికి రెండు రోజులు ముందే ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాల దన్నుతో మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయిల్లో (మూడు శాతానికి పైగా) లాభపడి గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. దీంతో అధిక ధరల వద్ద లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు (0.97 శాతం) నష్టపోయి 38,969.80 వద్ద ముగియగా, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం క్రితం రోజుతో పోలిస్తే 119 పాయింట్లు (ఒక శాతం) క్షీణించి 11,709 వద్ద స్థిరపడింది. సోమవారం నిఫ్టీ 421 పాయింట్లు, సెన్సెక్స్ 1,422 పాయింట్లు చొప్పున పెరిగిన విషయం గమనార్హం. శాతం వారీగా చూస్తే ఆరేళ్లలోనే ఒక రోజులో అత్యధికంగా పెరిగినట్టు లెక్క. మంగళవారం ఆరంభంలో మార్కెట్లు సానుకూలంగానే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 39,571.73 వరకు వెళ్లింది. నిఫ్టీ సైతం రికార్డు గరిష్ట స్థాయి 11,883.55ను నమోదు చేసింది. కానీ, మధ్యాహ్నానికి వాతావరణం మారిపోయింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల ఉత్సాహం తగ్గిపోవడం, ఫలితాలను మార్కెట్లు ఇప్పటికే గ్రహించినందున ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో లాభాల నుంచి మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి.
టాటా మోటార్స్‌కు తీవ్ర నష్టాలు
ఆటో, టెలికం, మెటల్, టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగ స్టాక్స్ ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్ షేరు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంది. సోమవారం కంపెనీ ప్రకటించిన ఫలితాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. కంపెనీ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం క్షీణించడంతో, ఈ స్టాక్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్‌ఈలో 7 శాతానికి పైగా నష్టపోయి 176.60 వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 7 శాతం నష్టపోయింది. అలాగే, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టాటా స్టీల్ షేర్లు 3 శాతం వరకు పడిపోయాయి. మరోవైపు ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్ మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రధాన సూచీలకు అనుగుణంగానే మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాలను చూవిచూశాయి. రూపాయి కేవలం రెండు పైసల లాభంతో 69.72 వద్ద స్థిరపడింది. బ్రెంట్ క్రూడ్‌సైతం ఏ మార్పు లేకుండా 72 డాలర్ల వద్ద ఉంది.
పోల్స్ నిజమైతే తదుపరి ర్యాలీ
‘‘ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు ఉంటే ఈ ర్యాలీ కొనసాగుతుంది. నాణ్యమైన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పనితీరు చూపిస్తాయి. అలాగే, ఆర్థిక సంస్కరణలు, ఎర్నింగ్స్‌లో వృద్ధి వంటి అంశాల తోడ్పాటుతో స్వల్పకాలంలో మార్కెట్లకు రక్షణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment