ముంబై : విదేశీ ఫండ్ల కొనుగోలు జోరుతో సోమవారం ట్రేడింగ్ లో భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు, నేటి(మంగళవారం) ట్రేడింగ్ లో వెనక్కి జంకాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ నష్టాలను నమోదుచేస్తున్నాయి. సెన్సెక్స్ 22.85 పాయింట్ల నష్టంతో, 25,666.01 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13.40 పాయింట్లు పడిపోతూ 7,852.65 వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పవర్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, దేశీయ సూచీలు నష్టాలను నమోదు చేస్తున్నాయి.
హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నికరలాభాలు పెరగడంతో, దాన్ని షేర్లు 1శాతం మేర పెరిగాయి. అదేవిధంగా అదానీ పోర్ట్స్, డాక్టర్. రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, మారుతీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ లు లాభాల్లో నడుస్తుండగా.. వేదాంత, హిందాల్కో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీలు నష్టాలను నమోదుచేస్తున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా నష్టాలోనే నడుస్తున్నాయి. బంగారం రూ.24 నష్టంతో రూ.29,781గా నమోదవుతుండగా... వెండి రూ.94 నష్టంతో రూ.40,655 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.7 గా ఉంది.