నష్టాల్లో బెంచ్ మార్కు సూచీలు
Published Tue, Jan 17 2017 4:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
స్వల్పలాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ముగింపులో కిందకి పడిపోయాయి. నిఫ్టీ 8400 కిందకి పడిపోయి, 8398 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ సైతం 52.51 పాయింట్లు దిగజారి 27235.66 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్, హీరో మోటార్ కార్పొ, హెచ్యూఎల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా.. రిలయన్స్ కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ నష్టాలు గడించాయి. ఆయిల్, మెటల్స్, ఎంపికచేసిన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్లో నష్టాలు కొనసాగడంతో మధ్యాహ్నం ట్రేడింగ్లో బెంచ్మార్కు సూచీలు పడిపోయాయి.
ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో దాదాపు 3 శాతం పడిపోయాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ప్రభుత్వ బడ్జెట్పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు కొరత ఏర్పడటంతో ఆర్థికవ్యవస్థకు సపోర్టుగా బడ్జెట్ వస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.08 పైసలు బలపడి 68.01 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు 219 రూపాయలు లాభపడి 28,748గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement