సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో ఇవాళ అనూహ్య ఊగిసలాట కనిపించింది. ఆరంభ లాభాలనుంచి మిడ్ సెషన్ తరువాత పుంజుకున్న కీలక సూచీలు చివరి గంటలో బాగా వెనుకంజ వేసాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఒకదశలో సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్ చేసింది. 38,250ను తాకింది. కానీ చివరలో కేవలం 269 పాయింట్లకు లాభానికి సరిపెట్టుకుంది. చివరికి సెన్సెక్స్ 38 వేలకు ఎగువన, నిఫ్టీ 11400 కి పైన ముగియడం విశేషం. సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 38,024 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 11,427 వద్ద స్థిరంగా ముగిసాయి.
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌తో జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లలో రెండు రోజులు వరుసగా భారీ లాభాలతో హుషారెత్తించాయి. నిన్న(గురువారం) లాభాల నుంచి స్వల్ప విరామం తరువాత మళ్లీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఐదో రోజు కూడా లాభాల దౌడు తీశాయి. గత దశాబ్దన్నర కాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ ఇంట్రాడేలో ఫలితంగా 2018 సెప్టెంబర్ 14 తదుపరి తిరిగి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా 2019లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరినట్లయ్యింది. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 30,537 కోట్లను ఇన్వెస్ట్ చేయడంతో మార్కెట్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ లాభాలు మార్కెట్లను లీడ్ చేశాయి. కొటక్ బ్యాంక్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్,యూపీఎల్, గెయిల్, ఐసీఐసీఐ 5-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యస్‌బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐటీసీ, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, హిందాల్కో, టాటా స్టీల్, హీరో మోటో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment