మరో కీలక మార్కును తాకిన నిఫ్టీ
Published Tue, Aug 1 2017 9:54 AM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
ముంబై :దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డుల పర్వం కొనసాగుతోంది. నిఫ్టీ ప్రారంభంలో మరో కీలకమార్కు 10,101.05ని తాకింది. ఆసియన్ మార్కెట్ల నుంచి వీచే సానుకూల పవనాలు, ఆర్బీఐ ఈసారి జరపబోయే ద్రవ్యపాలసీలో రేట్ల కోత ఉండొచ్చననే అంచనాలతో దేశీయ మార్కెట్లు మంగళవారం సెషన్‌లోనూ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 20.51 పాయింట్ల లాభంలో 32,535 వద్ద, నిఫ్టీ 11.20 పాయింట్ల లాభంలో10,088 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ రెండు రోజుల మీటింగ్ నేడే ప్రారంభం కాబోతుంది. బుధవారం రేట్ల కోతపై ఆర్బీఐ ఓ ప్రకటన చేస్తోంది.
ద్రవ్యోల్బణ గణాంకాలు దిగిరావడంతో ఈసారి కచ్చితంగా రేట్ల కోత ఉంటుందని మెజార్టీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహింద్రా నికర లాభం 6.5 శాతం పెరగడంతో, ఆ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి. టెక్ మహింద్రా షేరు 5 శాతం మేర పైకి జంప్ చేసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.4 శాతం పైకి ఎగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 64.13 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 79 రూపాయల నష్టంలో 28,501 వద్ద కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement