
ముంబై : గత కొన్ని రోజులకు వాహనదారులకు, ఇటు మార్కెట్లకు కాక పుట్టిస్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు చల్లబడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కిందకి దిగిరావడంతో పాటు, రూపాయి విలువ రికవరీ అవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పైకి జంప్ చేశాయి. ప్రారంభంలోనే 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 151 పాయింట్ల లాభంలో 35,076 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 56 పాయింట్ల లాభంలో 10,661 వద్ద కొనసాగుతోంది. ఆయిల్‌ను ఉత్పత్తి చేసే టాప్ ఉత్పత్తిదారులు, అవుట్‌పుట్‌ను పెంచనున్నామని సంకేతాలు ఇవ్వడంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి. దీంతో ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు 5 శాతం నుంచి 7 శాతం మధ్యలో పైకి ఎగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్‌కు 80.50 డాలర్ల వద్ద 2018 గరిష్ట స్థాయిని చేరుకోగా, ప్రస్తుతం ఇవి 75 డాలర్లుగా నమోదయ్యాయి.
టాప్ గెయినర్లుగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మాలు లాభాలు పండిస్తుండగా.. టెక్ మహింద్రా, వేదంతా, పీసీ జువెల్లరీ, ఐడీబీఐ బ్యాంకులు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 110 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి కూడా 27 పైసలు లాభపడింది. ప్రస్తుతం మరింత పుంజుకుని 95 పైసల లాభంలో 67.39 వద్ద కొనసాగుతోంది. వరుసగా ఆరు వారాల తర్వాత రూపాయి విలువ డాలర్ మారకం విలువతో పోటీగా బలపడుతోంది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, పై స్థాయిల వద్ద ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం వంటి కారణాలతో రూపాయి విలువ పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ చెప్పాయి. గత కొన్ని సెషన్ల నుంచి రూపాయిలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను నిరోధించడానికి ఆర్‌బీఐ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment