స్టాక్ మార్కెట్ల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. వెరసి వరుసగా ఆరో రోజు సెన్సెక్స్ లాభపడింది. తాజాగా 78 పాయింట్లు పురోగమించి 26,638 వద్ద ముగిసింది. తద్వారా ఆరు రోజుల్లో 324 పాయింట్లు జమ చేసుకుంది. ఇక నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి తొలిసారి 7,950కుపైన 7,954 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఒక దశలో సెన్సెక్స్ 26,674 పాయింట్ల కొత్త గరిష్టాన్ని తాకింది.
ఈ బాటలో నిఫ్టీ 7,968కు చేరింది. కాగా, ఆగస్ట్ నెలలో సెన్సెక్స్ మొత్తం 743 పాయింట్లు లాభపడింది. ఉక్రెయిన్‌లో మళ్లీ ఆందోళనలు తలెత్తినప్పటికీ, ఆర్థిక వృద్ధికి దన్నుగా మోడీ తీసుకుంటున్న చర్యలు సెంటిమెంట్‌కు ఊతమిస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు. శుక్రవారం విడుదలకానున్న తొలి క్వార్టర్ జీడీపీ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని చెప్పారు.
రైల్ షేర్ల పరుగు
హైస్పీడ్ రైళ్లతోసహా రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఓకే చెబుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో రైల్ షేర్లు పరుగుతీసాయ్. కెర్నెక్స్ మైక్రో, బీఈఎంఎల్, టెక్స్‌మాకో రైల్, స్టోన్ ఇండియా, కాళిందీ రైల్ 5% స్థాయిలో ఎగశాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్ 5% జంప్‌చేయగా, గెయిల్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, విప్రో, ఐసీఐసీఐ 2-1% మధ్య లాభపడ్డాయి. మరోవైపు టాటా పవర్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్ 2-1% మధ్య క్షీణించాయి. ఎఫ్‌ఐఐలు రూ. 711 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ ఫండ్స్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి.
కొనసాగిన డ్రీమ్ రన్
Published Fri, Aug 29 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement