
ముంబై: కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మరో ఆర్థ్ధిక ఉద్దీపనల ప్యాకేజీ వస్తుందన్న అంచనాలు బలపడడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా ర్యాలీ కొనసాగించాయి. ఐటీ, టాప్ బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలను పరుగెత్తించాయి. రూపాయి బలంగా రికవరీ కావడం ఐటీ స్టాక్స్‌కు కలిసొచ్చింది. నిఫ్టీ కీలకమైన 9,300 మార్క్ పైకి చేరుకుంది. 127 పాయింట్లు లాభపడి (1.38 శాతం) 9,314 వద్ద క్లోజయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు పెరిగి (1.54 శాతం) 31,863 వద్ద స్థిరపడింది.
► సెన్సెక్స్‌లో కోటక్ బ్యాంకు అత్యధికంగా 8.59 శాతం లాభపడి ముందు నిలిచింది. ఆ తర్వాత టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 6 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 5 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4 శాతం, ఓఎన్‌జీసీ 3 శాతం పెరిగాయి.
► టైటాన్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ నష్టపోయాయి. ఐటీ, టెక్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, మెటల్, ఆటో, ఎనర్జీ రంగాలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.35 శాతం వరకు లాభపడ్డాయి.
► 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 0.8 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ తాజా అంచనాలను వెల్లడించింది.
► మార్కెట్ల నుంచి నిధుల సమీకరణలో సెబీ వెసులుబాటు కల్పించింది. రెండు విడతల నిధుల సమీకరణ మధ్య అం తరం ప్రస్తుతం ఏడాది కాగా, దాన్ని 6 నెలలకు తగ్గించింది.
► ఉద్దీపనలపై యూరోజోన్ కీలకమైన భేటీ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది.
► ఆసియాలో హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభపడగా, షాంఘై నష్టాల్లో క్లోజయింది.
ప్రభుత్వ చర్యల ఆధారంగానే తదుపరి ర్యాలీ..
‘‘బెంచ్‌మార్క్ సూచీలు మరో ఉద్దీపనల ప్యాకేజీపై వస్తుందన్న ఆశాభావంతో సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళనకరం. త్వరలోనే కేసులు గరిష్టానికి చేరుకుంటాయని మార్కెట్లు అంచనాతో ఉన్నాయి. ఆర్ధిక రంగ ఉత్తేజానికి, పరిశ్రమలకు మద్దతుగా ప్రభుత్వం ప్రకటించే చర్యలపైనే మార్కెట్ల తదుపరి ర్యాలీ ఆధారపడి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
2 వారాల గరిష్టానికి రూపాయి
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో క్రితం ముగింపుతో పోలిస్తే 62 పైసలు పటిష్టమై 76.06 వద్ద క్లోజయింది. రూపాయికి ఇది రెండు వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దీపనల చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు రూపాయి బలపడేలా చేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా అదనంగా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేపట్టనున్నట్టు ఆర్‌బీఐ చేసిన ప్రకటన సెంటిమెంట్ బలపడేలా చేసినట్టు ట్రేడర్లు తెలిపారు.