
రెండు నెలల గరిష్టానికి సెన్సెక్స్
జోష్‌నిచ్చిన క్యూ3 ఫలితాలు
• కలసివచ్చిన షార్ట్ కవరింగ్
• బడ్జెట్‌పై అంచనాలు
• 258 పాయింట్ల లాభంతో 27,376కు సెన్సెక్స్
• 84 పాయింట్ల లాభంతో 8,476కు నిఫ్టీ
కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 8,400 పాయింట్ల పైన ముగిసింది. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 27,376 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 8,476 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. లోహ, వాహన, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, పీఎస్‌యూ, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
ప్రోత్సాహకరంగా క్యూ3 ఫలితాలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్ వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, డాలర్‌తో రూపాయి మారకం లాభాల్లో ముగియడం..సానుకూల ప్రభావం చూపాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది. 27,393–27,140 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 259 పాయింట్ల లాభంతో ముగిసింది. రానున్న బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల దృష్టి పెరుగుతోందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బుధవారం డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకుందని వివరించారు.
⇔ నాలుగు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు
30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లకే–భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యునిలివర్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు నష్టాలు వచ్చాయి. మిగిలిన 24 షేర్లు లాభపడ్డాయి.
⇔ బీఎస్‌ఈ ఐపీఓకు 1.55 రెట్లు స్పందన నేడు ముగింపు
బీఎస్‌ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రెండో రోజూ 1.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు(బుధవారం) ముగిసే ఈ ఐపీఓ ద్వారా బీఎస్‌ఈ రూ.1,243 కోట్లు సమీకరించనున్నది. రూ.805–806 ఇష్యూధర ఉన్న ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖ విలువ ఉన్న 1,07,99,039 షేర్లను జారీ చేయనున్నారు. ఇప్పటికే 1,67,06,394 షేర్లకు బిడ్‌లు వచ్చాయి.