ద్రవ్యలోటు గణాంకాల జోష్
* 363 పాయింట్ల లాభంతో 27,687కు సెన్సెక్స్
* 111 పాయింట్ల లాభంతో 8,374కు నిఫ్టీ
* కొనసాగుతున్న కీలక రేట్ల కోత అంచనాలు
ద్రవ్యలోటు గణాంకాల జోష్‌తో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. చివరి గంటలో వెల్లువెత్తిన కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోయాయి.
ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతానికే పరిమితమైందని ప్రభుత్వం వెల్లడించడం, ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కొనసాగుతుండడం, సకాలంలోనే వర్షాలు కురుస్తాయన్న అంచనాలు, తదితర అంశాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 27,687 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 8,374 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. పెట్రోల్ ధరలు పెంచడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు 4% పెరగడం కూడా స్టాక్ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేసింది. నిఫ్టీ మళ్లీ 8,300 పాయింట్ల పైన ముగిసింది.
ఆర్థిక మంత్రి అదే కోరుకుంటున్నారు..
నిర్దేశించుకున్న లక్ష్యానికంటే కూడా తక్కువ స్థాయిలోనే ద్రవ్యలోటును కట్టడి చేయగలిగామన్న ప్రభుత్వ ప్రకటన సెంటిమెంట్‌ను బలపరచిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లకు, ఆసియా మార్కెట్ పటిష్టంగా ట్రేడవడం తోడవడంతో స్టాక్ మార్కెట్ జోరు పెరిగిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు. వచ్చే నెల 2న జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్‌బీఐ కీలక రేట్లలో కోత విధించాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం సెంటిమెంట్‌కు మరింత బలాన్ని ఇచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ 3.5 శాతం అప్
రిఫైనరీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. సిటికోలిన్‌కు ఇన్నోవేటర్ బ్రాండ్‌గా సోమాజిన ఔషధాన్ని భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.5 శాతం పెరిగి రూ. 3,613వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 27షేర్లు లాభపడ్డాయి.
గెయిల్ 3.4 శాతం, టాటా పవర్ 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.9 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.8 శాతం, ఐటీసీ 1.8 శాతం, బజాజ్ ఆటో 1.8 శాతం, ఇన్ఫోసిస్ 1.6%, భెల్ 1.5 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.4%, హిందాల్కో 1.3 శాతం చొప్పున పెరిగాయి. 1,046 షేర్లు లాభాల్లో, 1,046 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,194 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,234 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,23,343 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.202 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.619 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.