సెన్సెక్స్‌ 31,230పైన స్థిరపడితే.. | Sensex zooms 1266 points to close at 31160 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 31,230పైన స్థిరపడితే..

Published Mon, Apr 13 2020 5:43 AM | Last Updated on Mon, Apr 13 2020 5:43 AM

Sensex zooms 1266 points to close at 31160 - Sakshi

కరోనా వైరస్‌ ఉధృతి కొన్ని యూరప్‌ దేశాల్లో తగ్గుముఖం పడుతోందన్న వార్తలు, క్రూడాయిల్‌ ఉత్పత్తిలో ఒపెక్‌ కోత, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరో భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం తదితర సానుకూల అంశాలతో గతవారం ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ బాగా లాభపడ్డాయి. అయితే మార్చి నెలలో నమోదైన కనిష్ట స్థాయిల నుంచి ఇప్పటివరకూ వివిధ దేశాలు సాధించిన ర్యాలీల్లో ఇండియా, బ్రెజిల్‌లు బాగా వెనుకపడివున్నాయి. అమెరికా సూచీలు వాటి మొత్తం నష్టాల్లో 50 శాతం రికవరీ చేసుకోగా, యూరప్‌ మార్కెట్లన్నీ కీలకమైన 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయిల్ని దాటాయి.

కానీ ఇండియా మార్కెట్‌ మాత్రం మార్చి కనిష్టస్థాయి నుంచి 21 శాతం మాత్రమే కోలుకోగలిగింది.  భారత్‌ సూచీల రికవరీ తక్కువగా వుండటానికి అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్లే ప్రధాన కారణం. ఫార్మా షేర్లు పెద్ద ఎత్తున ర్యాలీ జరిపినప్పటికీ, వాటికి ఇండెక్స్‌లో వెయిటేజి అత్యల్పం. ఫార్మాయేతర షేర్లలో ఐటీసీ, హెచ్‌యూఎల్, ఆర్‌ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ గతవారం భారీగా పెరగడంతో సూచీలు ఈ మాత్రమైనా రికవరీ కాగలిగాయి.  వచ్చే కొద్దివారాల్లో బ్యాంకింగ్‌ షేర్లు కోలుకోవడం లేదా కొత్త లీడర్లు ఆవిర్భవిస్తేనే మార్కెట్‌ గణనీయంగా పుంజుకునే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఏప్రిల్‌ 9తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్‌ వారంలో అనూహ్యంగా  31,000  పాయింట్ల స్థాయిని దాటేసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 3,569 పాయింట్ల భారీలాభంతో 31,160  పాయింట్ల వద్ద ముగిసింది.  గతవారం వరుసగా రెండు రోజులపాటు అవరోధం కల్గించిన 31,230 పాయింట్ల స్థాయి సెన్సెక్స్‌కు తక్షణ అవరోధం కల్గించవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడగలిగితే, రానున్న రోజుల్లో ట్రెండ్‌ను నిర్దేశించగలిగే 31,990 పాయింట్ల స్థాయిని అందుకునే ప్రయత్నాల్ని సెన్సెక్స్‌ చేయవచ్చు.

సెన్సెక్స్‌ జనవరిలో సాధించిన 42,273 పాయింట్ల నుంచి మార్చిలో నమోదుచేసిన 25,639 పాయింట్ల వరకూ జరిగిన పతనానికి 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 31,990 పాయింట్లు దాటితే మరికొద్దిరోజులు రిలీఫ్‌ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. ఈ స్థాయిపైన వెనువెంటనే 32,490 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి అవరోధాన్ని దాటకపోయినా, గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైనా 30,420 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 29,890 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 29,600 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.  

నిఫ్టీ 9,130 పాయింట్లకు అటు.. ఇటూ..  
క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,028 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి  9,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 9,130 పాయింట్లపైన స్థిరపడగలిగితే క్రమేపీ 9,390 పాయింట్ల స్థాయిని అందుకునే ఛాన్స్‌ ఉంటుంది. ఈ ఏడాది జనవరి– మార్చి నెలల మధ్య 12,430 పాయింట్ల నుంచి 7,511 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన ఈ 9,390 పాయింట్ల స్థాయి రానున్న కొద్దిరోజుల్లో మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తుంది.

ఈ స్థాయిపైన వేగంగా 9,510 పాయింట్ల స్థాయిని అందుకోవడంతో పాటు కొద్దిరోజుల్లో 9,800–10,000 పాయింట్ల శ్రేణిని అందుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ వారం 9,130 పాయింట్ల స్థాయిపైన స్థిరపడలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా 8,900 పాయింట్ల వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 8,750 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ లోపున 8,655 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement