ముంబై: స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాల వర్షం కురిసింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా వీచిన సానుకూలతల బలంతో సూచీలు బలం పుంజుకున్నాయి. ఎగుమతిదారులకు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు నిబంధనల విషయంలోనూ, రిఫండ్‌ల విషయంలోనూ ఉపశమనం కల్పించే నిర్ణయాలను జీఎస్టీ భేటీ సందర్భంగా తీసుకోవచ్చన్న అంచనాలున్నాయి.
గురువారం అమెరికా మార్కెట్లు మరో రికార్డు స్థాయిలకు నమోదు చేయడం ర్యాలీకి తోడ్పడ్డాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 31,814.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 10,000 సమీపానికి చేరింది. 91 పాయింట్ల లాభంతో 9,979.70 వద్ద క్లోజయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,040 కోట్ల విలువైన విక్రయాలు చేయగా, దేశీయ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.1,239 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం లాభాలకు తోడ్పడింది.
టాటా స్టీల్ 5 శాతం వరకు లాభపడి రూ.691.40కు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశీయ స్టీల్ ఉత్పత్తి 18 శాతం పెరిగి 5.98 మిలియన్ టన్నులుగా నమోదైనట్టు టాటా స్టీల్ చేసిన ప్రకటనతో షేరు ర్యాలీ చేసింది. సన్ ఫార్మా 3 శాతం పెరిగి రూ.530.40 వద్ద మగిసింది.
ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఆర్‌ఐఎల్, లుపిన్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్, విప్రో, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, కోటక్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐటీసీ లాభపడిన వాటిలో ఉన్నాయి.
హీరో మోటో కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి. ముఖ్యంగా మెటల్ రంగ స్టాక్స్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం, పీఎస్‌యూ 1.81 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగియగా, యూరోప్‌లో మిశ్రమ ధోరణి కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment