న్యూఢిల్లీ : దేశీయ రైళ్లు శాకాహారులు, మాంసాహారులను వేరు చేయనున్నాయా? ఆన్‌బోర్డు రైళ్లలో శాకాహారులకు, మాంసాహారులకు వేరు వేరు సీట్లు కేటాయించనున్నారా? అంటే ఏమో అది జరగవచ్చు అంటున్నారు కొందరు. ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకుని రైళ్లలో వేరు వేరు సీట్లు కేటాయించేలా కోర్టు జోక్యం చేసుకోవాలని గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను అహ్మదాబాద్‌లోని ఖాన్‌పూర్‌కు చెందిన ఈఈ సైద్ అనే న్యాయవాది దాఖలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు ప్రకారం ప్రయాణికుల ఆహారపు ఎంపికలను బట్టి రైళ్లలో సీట్లను కేటాయించేలా దేశీయ రైల్వేను ఆదేశించాలని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. వచ్చే వారం ఈ పిల్ విచారణకు రానుంది.
తాను వేసిన ఈ పిల్‌లో ఎలాంటి రాజకీయ కోణం లేదని పిటిషనర్ చెప్పారు. ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందించడంలో దేశీయ రైల్వే అత్యంత జాగ్రత్త వహించాలని సైద్ అన్నారు. ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్‌ను కల్పించాలని, దీంతో శాకాహార ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వారి ఆహారపు అలవాట్లకు తగ్గట్టు సీట్లను ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించవచ్చన్నారు. సైద్ తాను శాకాహారిగా చెప్పారు. ఈ పిల్‌లో రైల్వే మంత్రిత్వ శాఖను, దేశీయ రైల్వే కేటరిగింగ్, టూరిజం కార్పొరేషన్‌ను, పశ్చిమ రైల్వే జోన్‌ను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment