కొత్త జిల్లాలతో పట్టణాలకు పట్టం! | shadnagar devolopment speedup with new districts announcement | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలతో పట్టణాలకు పట్టం!

Published Fri, Oct 28 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

కొత్త జిల్లాలతో పట్టణాలకు పట్టం!

కొత్త జిల్లాలతో పట్టణాలకు పట్టం!

పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న షాద్‌నగర్
6,416 డాక్యుమెంట్లు.. రూ.11.46 కోట్ల ఆదాయం
భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్టర్ల పరుగులు

నీళ్లు.. ఎత్తు నుంచి పల్లానికి ఎలాగైతే ప్రవహిస్తాయో.. అభివృద్ధి కూడా అంతే! ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటూ స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వైపే అభివృద్ధి పరుగులు పెడుతుందని దానర్థం!! ఈ విషయంలో మాత్రం ముందుగా చెప్పుకోవాల్సింది షాద్‌నగర్ గురించే. ఫార్మా, ఈ-కామర్స్ సంస్థలకు షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలు కేంద్ర బిందువులుగా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు షాద్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 6,416 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.11.46 కోట్ల ఆదాయం వచ్చింది.

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి 48 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 22 కి.మీ. దూరంలో ఉందీ షాద్‌నగర్. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుకెళ్లే జాతీయ రహదారి-44  షాద్‌నగర్ మీదుగానే వెళుతుంది కూడా. పెపైచ్చు ఔటర్ రింగ్ రోడ్డుతో నగరానికి, మెట్రోతో నగరమంతా సులువుగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటం షాద్‌నగర్‌కు అదనపు కలిసొచ్చే అంశం.

ఏటా 25-30 శాతం ధరల వృద్ధి..
భవిష్యత్తు అవసరాల రీత్యా స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు షాద్‌నగర్ ప్రాంతం సరైందని స్పేస్ విజన్ ఎడిఫైస్ సీఎండీ నర్సింహా రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ప్రస్తుతమిక్కడ గిరిధారి, డీఎల్‌ఎఫ్, స్పేస్ విజన్ వంటి స్థిరాస్తి సంస్థల నిర్మాణాలు, వెంచర్లున్నాయి. తిమ్మాపూర్‌లో ఓ కంపెనీ అతిపెద్ద రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది కూడా. ఐదేళ్ల క్రితం అనుమతి పొందిన లే-అవుట్లలో గజం ధర రూ.1,000 మించి ఉండకపోయేది. కానీ, ఇప్పుడు షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో గజం ధర రూ.2,700లకు పైగానే పలుకుతుందన్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముం ది. ఏటా 25-30 శాతం రేట్లు పెరుగుతాయని అంచనా.

పెట్టుబడులతో కంపెనీల క్యూ..
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు షాద్‌నగర్ గుండా వెళ్లనుంది. అలాగే స్థానికంగా లభించే వనరుల ఆధారంగా జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జడ్చర్లలో 100 ఎకరాల్లో వస్త్రాల తయారీ, తోలు ఉత్పత్తుల సమూహం ఏర్పాటు చేయనున్నారు కూడా.

అమెజాన్ కొత్తూరులో 2.80 లక్షల చ.అ.ల్లో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేస్తోంది. ఇక్కడే పీఅండ్‌జీ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా మూడేళ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా మరో రూ.650 కోట్లతో ప్లాంటును విస్తరించనుంది.

{పభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వుల కారణంగా నగరంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) షాద్‌నగర్‌లోని బాలానగర్‌కు తరలనుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్  షాద్‌నగర్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న కమ్మాదనం రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలనుంది.

వేములలో కోజెంట్ కంపెనీ రూ.300-400 కోట్లతో గ్లాస్ బాటిళ్ల తయారీ యూనిట్‌ను విస్తరించనుంది.

విద్యా, వినోదం కూడా..
అంతర్జాతీయ విశ్వ విద్యాలయమైన సింబయాసిస్, టాటా వర్సిటీ వంటివి కొత్తూరులోనే ఉన్నాయి. మరో నాలుగు వేద విశ్వవిద్యాలయాలూ ఉన్నాయిక్కడ. ఈ మార్గంలో బయోకన్జర్వేషన్ జోన్ కింద 20 కి.మీ. పరిధి ఉండటంతో ఆ తర్వాత ఉన్న ప్రాంతం పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. భూగర్భ జల వనరులకూ కొదవేలేదిక్కడ. ఇక్కడ 650 ఎంసీఎం వరకు నీరు అందుబాటులో ఉందని ది సెంట్రల్ గ్రౌండ్ బోర్డ్ లెక్కలే చెబుతున్నాయి. బాలానగర్, షాద్‌నగర్‌ల్లో వెజిటేబుల్ క్లస్టర్‌లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.

రూ.11.46 కోట్ల ఆదాయం
షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందటంతో ఇక్కడ రియల్ వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి షాద్‌నగర్ ఎస్‌ఆర్ పరిధిలో మొత్తం 6,416 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, రూ.11.46 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement