మ్యూచువల్ ఫండ్ స్టాక్ విక్రయాలు @ 8,058 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు గత నెలలో నికరంగా రూ.8,058 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 2014, మే తర్వాత మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇదే మొదటిసారని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ వ్యవస్థాపకులు సిద్ధాంత్ జైన్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు భారీగా నిధులను వెనక్కి తీసుకున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో మొత్తం రూ.68,000 కోట్ల నికర పెట్టుబడులు పెట్టాయి.
ఈ నెలలో జోరుగానే...
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కారణంగా పలువురు రిటైల్ ఇన్వెస్టర్లు సిప్(సిస్టమాటిక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లు ప్రారంభిస్తారని, మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా నిధులు వస్తాయని, మ్యూచువల్ ఫండ్స్ ఈ నిధులను స్మాక్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయని సిద్ధాంత్ జైన్ వివరించారు. ఇక గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు నికరంగా రూ.8,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి రెండు కారణాలున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయినందున నగదు అవసరాలు, పుస్తకాల్లో సర్దుబాటు నిమిత్తం చాలా బ్యాంకులు, కంపెనీలు మ్యూచువల్ ఫండ్ల నుంచి నిధులను వెనక్కితీసుకోవడం మొదటి కారణమని వివరించారు.వ్యవస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం మ్యూచువల్ ఫండ్ పొజిషన్ల నుంచి నిష్ర్కమించడం రెండో కారణమని పేర్కొన్నారు. కాగా స్టాక్ మార్కెట్ నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.14,000 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.