దిగ్గజ కంపెనీల ఫలితాలపై చూపు
♦ టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ ఫలితాలు ఈ వారంలోనే
♦ 11న పారిశ్రామికోత్పత్తి గణాంకాల రాక
♦ మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించేవి ఇవే
న్యూఢిల్లీ: ఈ వారం దేశీయంగా వెలువడే పారిశ్రామికోత్పత్తి, బ్లూచిప్ కంపెనీలైన టాటా స్టీల్, టాటామోటార్స్, ఎస్‌బీఐ, అరబిందో ఫార్మా, బీహెచ్‌ఈఎల్, గెయిల్ ఫలితాలపై మార్కెట్లు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. వీటితోపాటు రుతుపవనాల విస్తరణ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపేవేనని విశ్లేషకులంటున్నారు. అయితే, అమెరికా బలమైన ఉద్యోగ గణాంకాలు గత శుక్రవారం వెలువడగా సోమవారం మార్కెట్లు వీటికి స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కంపెనీల ఆర్థిక ఫలితాలను మార్కెట్లు గమనించనున్నాయని, స్టాక్ వారీగా కదలికలు ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్‌హెడ్ అబ్నీష్ కుమార్ సుదాన్షు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం మార్కెట్ల గమనం ప్రధానంగా కంపెనీల ఫలితాలు, ఐఐపీ డేటా ఆధారంగానే ఉంటుందన్నారు. అయితే, మార్కెట్లు అధిక వ్యాల్యేషన్ల కారణంగా స్వల్ప కాలానికి తాము అప్రమత్త ధోరణితోనే కొనసాగుతామని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. గత వారం బీఎస్‌ఈ కేవలం 15 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 52 పాయింట్ల పెరుగుదలతో సూచీలు వరుసగా ఐదో వారం లాభాల్లో కొనసాగినట్టయింది.
టాటా స్టీల్ ఫలితాలు నేడే: సోమవారం టాటా స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం (ఈ నెల 8న) థెర్మాక్స్ కంపెనీ, ఈ నెల 9న(బుధవారం) టాటా మోటార్స్, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎండీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలు, గురువారం (ఈ నెల 10న) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, గెయిల్ ఇండియా, ఎంఓఐఎల్ కంపెనీలు, శుక్రవారం (11న) బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిప్లా, హిందాల్కో కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.
ఆర్థిక గణాంకాల విషయానికొస్తే, జూన్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 11న (శుక్రవారం) మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడతాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే... సోమవారం జపాన్ వాణిజ్య గణాంకాలు, మంగళవారం (ఈ నెల 8న) చైనా జూలై ట్రేడ్ బ్యాలెన్స్ డేటా, శుక్రవారం (ఈ నెల 11న) చైనా ఎఫ్‌డీఐ గణాంకాలు వెల్లడవుతాయి.
రాబడుల్లో వ్యాల్యూ ఫండ్స్ వెనుకంజ: వ్యాల్యూ ఫండ్స్ గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను పెంచడంలో వెనుకపడ్డాయి. వీటికంటే సూచీలే మెరుగైన రాబడులు ఇచ్చాయి. ప్రభుత్వ నిబంధనలు, పన్నుల్లో మార్పులు ఇలా ఎన్నో రకాల అంశాలతో పెరగాల్సినంత పెరగని షేర్లలో, మార్కెట్లు పట్టించుకోని సరసమైన విలువలతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వ్యాల్యూ ఫండ్స్ చేసే పని. ఈ విధానమే తక్కువ రాబడులు ఇవ్వడానికి కారణం. ఎందుకంటే ఈ ఫండ్స్ ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. గత ఏడాదిగా ఈ రంగాలకు చెందిన షేర్లు పెద్దగా పెరగకపోగా, కొన్ని ఇంకా తగ్గాయి.