రెండు ముక్కలైనా కొత్త ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పొరపాటున కొత్త స్మార్ట్‌ఫోన్ కిందపడి ముక్కలైతే.. ఎవరైనా ఆశలు వదులుకోవాల్సిందే. అయితే పాడైన ఫోన్ స్థానంలో కొత్తది ఇస్తామంటోంది టెలికం రంగ సంస్థ టాటా డొకొమో. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రపంచంలో తొలిసారిగా సింప్లీ స్వాప్ పేరుతో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించింది. ఈ పథకంలో నమోదైన కస్టమర్లు ఫోన్ పాడైనా లేదా మార్చుకోవాలనుకున్నా కొంత రుసుముతో కొత్త ఫోన్‌ను పొందవచ్చు.
ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కలిగిన కస్టమర్లకు ప్రశాంతత చేకూర్చేందుకే ఈ పథకమని టాటా టెలిసర్వీసెస్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ హెడ్ అభిజిత్ కిషోర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 30 బ్రాండ్లకు చెందిన 500పైగా మోడళ్లకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు.
ఇవీ నిబంధనలు..
సింప్లీ స్వాప్ పథకంలో చేరే కస్టమర్లు ఫోన్ కొన్న తేదీ నుంచి 90 రోజులలోపే పేరు నమోదు చేసుకోవాలి. పథకం కాల పరిమితి 12 నెలలు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఫోన్ మార్చుకోవచ్చు. కస్టమర్ వద్ద ఉన్న ఫోన్ విలువనిబట్టి నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 వేలలోపు మోడల్ అయితే చార్జీ రూ.89 ఉంది. ఇలా ఫోన్ల ధరల శ్రేణినిబట్టి చార్జీ రూ.669 వరకు ఉంది.
ఈ రుసుమును నెలవారీ ఫోన్ బిల్లులో కలుపుతారు. కస్టమర్ ఫోన్‌ను మార్చుకున్నందుకుగాను అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాలి. ఈ చార్జీ మోడల్‌నుబట్టి రూ.500 నుంచి రూ.5,800 దాకా ఉంది. ఫోన్ ఏ స్థితిలో ఉన్నా తీసుకుని అటువంటిదే కొత్తది 72 గంటల్లో ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఇస్తారు. కస్టమర్ ఇల్లు/కార్యాలయానికే వచ్చి ఈ సేవలు అందిస్తారు.
మొబైల్ అంటే ఫ్రెండ్..
దేశంలో మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా 2013 రెండవ త్రైమాసికంలో 16 శాతం నమోదైంది. 2014 క్యూ2కు వచ్చేసరికి ఇది 29 శాతానికి ఎగబాకింది. స్మార్ట్‌ఫోన్ ఒక స్టేటస్ సింబల్ అయింది. జీవితంలో భాగమైపోయింది కూడా. ఎంతగా అంటే ఒక ఫ్రెండ్‌గా భావించేంతగా అని అభిజిత్ కిషోర్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సాధారణంగా ఏడాదికోసారి ఫోన్‌ను మారుస్తున్నారని చెప్పారు.
త్వరలో 3జీ సేవలు..
టాటా డొకొమో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో (తెలంగాణ, సీమాంధ్ర) ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3జీ సేవలను ప్రారంభించనుంది. సర్కిల్‌లో కంపెనీకి 5 వేలకుపైగా టవర్లున్నాయి. మూడు నెలల్లో మరో 250 టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఏపీ సర్కిల్‌లో కంపెనీకి 65 లక్షల మంది వినియోగదార్లున్నారు. వీరిలో 20 శాతం మంది పోస్ట్ పెయిడ్ చందాదారులు.