tata docomo
-
డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టాటా డొకొమో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో పేరుతో కొత్త డాంగిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అయిదు ఉపకరణాలను ఇంటర్నెట్కు అనుసంధానించవచ్చు. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇందులోని పవర్‌బ్యాంక్ పోర్టబుల్ చార్జర్‌గా పనిచేస్తుంది. 32 జీబీ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌ను డాంగిల్‌కు పొందుపరిచారు. ధర రూ.2,899. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సౌకర్యం ఉందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ సంజీవ ఝా ఈ సందర్భంగా తెలిపారు. -
నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్
టాటా డొకొమో ఆఫర్ న్యూఢిల్లీ: టాటా డొకొమో వినియోగదారులు తమకు ఇష్టం వచ్చిన అంకెలతో సొంతంగా మొబైల్ ఫోన్ నంబర్‌ను సృష్టించుకోవచ్చు. తమ పుట్టిన రోజు తేదీలతో కానీ, లేదా తమకు ఇష్టమైన అంకెలతో, లేదా తేలికగా గుర్తించుకునేలా నచ్చిన అంకెలతో మొబైల్ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని టాటా టెలీ సర్వీసెస్ హెడ్(బ్రాండెడ్ రిటైల్, స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్)సందీప్ సింఘాల్ తెలిపారు. వినియోగదారులు ఏ టాటా డొకొమో బ్రాండ్ స్టోర్స్‌లోకి వెళ్లినా, ఇలాంటి మొబైల్ నంబర్ పొందవచ్చని వివరించారు. కొత్త వినియోగదారులకే కాక ప్రస్తుత కస్టమర్లకూ ఇది వర్తిస్తుందన్నారు. ఈ తరహా సేవలందించడం మొబైల్ ఫోన్ల పరిశ్రమలో ఇదే మొదటిసారని వివరించారు. -
రెండు ముక్కలైనా కొత్త ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పొరపాటున కొత్త స్మార్ట్‌ఫోన్ కిందపడి ముక్కలైతే.. ఎవరైనా ఆశలు వదులుకోవాల్సిందే. అయితే పాడైన ఫోన్ స్థానంలో కొత్తది ఇస్తామంటోంది టెలికం రంగ సంస్థ టాటా డొకొమో. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రపంచంలో తొలిసారిగా సింప్లీ స్వాప్ పేరుతో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించింది. ఈ పథకంలో నమోదైన కస్టమర్లు ఫోన్ పాడైనా లేదా మార్చుకోవాలనుకున్నా కొంత రుసుముతో కొత్త ఫోన్‌ను పొందవచ్చు. ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కలిగిన కస్టమర్లకు ప్రశాంతత చేకూర్చేందుకే ఈ పథకమని టాటా టెలిసర్వీసెస్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ హెడ్ అభిజిత్ కిషోర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 30 బ్రాండ్లకు చెందిన 500పైగా మోడళ్లకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవీ నిబంధనలు.. సింప్లీ స్వాప్ పథకంలో చేరే కస్టమర్లు ఫోన్ కొన్న తేదీ నుంచి 90 రోజులలోపే పేరు నమోదు చేసుకోవాలి. పథకం కాల పరిమితి 12 నెలలు. ఏడాదిలో రెండు సార్లు మాత్రమే ఫోన్ మార్చుకోవచ్చు. కస్టమర్ వద్ద ఉన్న ఫోన్ విలువనిబట్టి నెలవారీ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 వేలలోపు మోడల్ అయితే చార్జీ రూ.89 ఉంది. ఇలా ఫోన్ల ధరల శ్రేణినిబట్టి చార్జీ రూ.669 వరకు ఉంది. ఈ రుసుమును నెలవారీ ఫోన్ బిల్లులో కలుపుతారు. కస్టమర్ ఫోన్‌ను మార్చుకున్నందుకుగాను అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాలి. ఈ చార్జీ మోడల్‌నుబట్టి రూ.500 నుంచి రూ.5,800 దాకా ఉంది. ఫోన్ ఏ స్థితిలో ఉన్నా తీసుకుని అటువంటిదే కొత్తది 72 గంటల్లో ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఇస్తారు. కస్టమర్ ఇల్లు/కార్యాలయానికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. మొబైల్ అంటే ఫ్రెండ్.. దేశంలో మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 2013 రెండవ త్రైమాసికంలో 16 శాతం నమోదైంది. 2014 క్యూ2కు వచ్చేసరికి ఇది 29 శాతానికి ఎగబాకింది. స్మార్ట్‌ఫోన్ ఒక స్టేటస్ సింబల్ అయింది. జీవితంలో భాగమైపోయింది కూడా. ఎంతగా అంటే ఒక ఫ్రెండ్‌గా భావించేంతగా అని అభిజిత్ కిషోర్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సాధారణంగా ఏడాదికోసారి ఫోన్‌ను మారుస్తున్నారని చెప్పారు. త్వరలో 3జీ సేవలు.. టాటా డొకొమో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో (తెలంగాణ, సీమాంధ్ర) ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3జీ సేవలను ప్రారంభించనుంది. సర్కిల్లో కంపెనీకి 5 వేలకుపైగా టవర్లున్నాయి. మూడు నెలల్లో మరో 250 టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఏపీ సర్కిల్లో కంపెనీకి 65 లక్షల మంది వినియోగదార్లున్నారు. వీరిలో 20 శాతం మంది పోస్ట్ పెయిడ్ చందాదారులు. -
టాటాడొకోమోతో ట్రూకాలర్ ఒప్పందం
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన మొబైల్ కాలర్ ఐడీ సేవల సంస్థ ట్రూకాలర్.. టాటా డొకోమోతో ఒప్పందం కుదురుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. దేశంలో ఒక టెలికం కంపెనీతో ట్రూకాలర్ జట్టుకట్టడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఒప్పందం ప్రకారం టాటా డొకోమో ఖాతాదారులు మొబైల్ ఇంటర్నెట్‌కోసం ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ట్రూకాలర్ సర్వీసులను పొందేందుకు వీలవుతుంది. ట్రూకాలర్ అప్లికేషన్(యాప్).. యూజర్ల అనుమతితో వాళ్ల ఫోన్‌బుక్‌లోని నంబర్లను తమ డేటాబేస్‌లో చేర్చుకుంటుంది. ఎవరైనా మరో ట్రూకాలర్ యూజర్ ఫోన్‌కాల్‌ను అందుకున్నప్పుడు అవతలివాళ్ల నంబర్ తమ ఫోన్లో నిక్షిప్తమైలేనప్పటికీ... వాళ్ల పేరును స్క్రీన్‌పై చూపించడం ఈ ట్రూకాలర్ ప్రత్యేకత. ‘భారత్ మార్కెట్ మాకు చాలా కీలకమైనది. మొత్తం 5.5 కోట్ల మంది సబ్స్క్రయిబర్లలో ఇక్కడినుంచే 3 కోట్ల మంది ఉన్నారు. టాటా డొకోమోతో ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతేంటో ఈ గణాంకాలే చెబుతాయి’ అని ట్రూకాలర్ వైస్ ప్రెసిడెంట్(గ్రోత్ అండ్ పార్ట్నర్షిప్-ఆసియా) కరి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు తమ నంబర్లను సెర్చ్ చేయకుండా చేయడం కోసం యూజర్లు నంబర్లను ట్రూకాలర్ వెబ్సైట్ నుంచి తొలగించుకునే(అన్‌లిస్ట్) అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సాధారణ సేవలతో పాటు ప్రీమియం సేవలను కూడా టాటా డొకోమో కస్టమర్లు 90 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరించారు. -
ఫొటాన్ మ్యాక్స్ వైఫై... ప్లగ్ చేస్తే.. ఎక్కడైనా నెట్!
రోజంతా ఇంటర్నెట్ వాడుతూంటారా? స్మార్ట్ఫోన్తోపాటు పీసీ, టాబ్లెట్ కూడా ఉన్నాయా? అన్నింటికీ ఒకేసారి నెట్ కనెక్షన్ కావాలనుకుంటున్నారా? అయితే టాటా డొకోమో ఫోటాన్ వైఫై మ్యాక్స్ మీ కోసమే. ఎక్కడ ప్లగ్ చేసుకుంటే అక్కడ ఓ మొబైల్ వైఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసే దీన్ని ఒకేసారి అయిదు గాడ్జెట్స్‌కు అనుసంధానించుకోవచ్చు. ఉపయోగించడం కూడా చాలా సులువు. యూఎస్బీ అడాప్టర్ ఉన్న ప్లగ్‌లోకి దీన్ని చొప్పించి పవర్ సాకెట్లో పెట్టేస్తే చాలు. నెట్ బ్రౌజింగ్‌కు వైఫై హాట్‌స్పాట్ రెడీ! టాటా ఫొటాన్ మ్యాక్స్ వైఫై పరికరాన్ని ‘శాస్త్ర’ బృందం వారం రోజులపాటు పరీక్షించింది. హైదరాబాద్ నలుమూలా ఉన్న సాక్షి ఉద్యోగులు ఒకరోజుపాటు దీన్ని వాడి చూశారు. నెట్బ్రౌజింగ్తోపాటు వీడియో స్ట్రీమింగ్, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల డౌన్లోడింగ్, అప్డేషన్లకు ఉపయోగించి చూశారు. వీరిలో 75 శాతం మంది నెట్ వేగం బాగుందని మెచ్చుకోగా... మిగిలిన వారు ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్టవేగం 3.1 ఎంబీపీఎస్ వరకూ ఉంటుందని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇది 1.2 నుంచి 2 ఎంబీపీఎస్ వరకూ ఉన్నట్లు అంచనా. వంద మీటర్ల పరిధి వరకూ వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటవుతుందని కంపెనీ చెబుతోంది. కనెక్షన్ స్థిరంగా ఉన్నప్పటికీ దూరం పెరిగేకొద్దీ నెట్ వేగం మందగించింది. 20 నుంచి 30 మీటర్ల దూరం వరకూ మాత్రమే నెట్ వేగం బాగా ఉన్నట్లు గుర్తించాం. రెండు, మూడు పరికరాలను అనుసంధానించినప్పుడు ఉన్నంత వేగం అయిదింటిని కనెక్ట్ చేసినప్పుడు లేకపోవడం గమనార్హం. దాదాపు రూ.2000 ఖరీదు చేసే ఈ పరికరం... నెలకు రూ.650 మొదలుకొని రూ.1500 వరకూ నెలవారీ ఛార్జీలతో అయిదు పరికరాలకు నెట్ అందిస్తుంది. ఒక్కో గాడ్జెట్ నెట్ ఛార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఇది కొంత చౌకనే చెప్పాలి. -
టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా డొకొమో సీడీఎంఏ కస్టమర్ల కోసం ‘ఫోటాన్ మ్యాక్స్’ పేరుతో డాంగిల్ వంటి వైఫై ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్.. ఇలా ఏదేని అయిదు ఉపకరణాల్లో దీని ద్వారా ఒకే సమయంలో ఇంటర్నెట్ వినియోగించవ చ్చు. 6.2 ఎంబీపీఎస్ వేగంతో ఇది పనిచేస్తుందని కంపెనీ ఆంధ్రప్రదేశ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ ఎస్.రామకృష్ణ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రూ.650 నుంచి రూ.1,500 విలువ గల వైఫై ప్లాన్లలో దేనినైనా కస్టమర్లు ఎంచుకోవచ్చని చెప్పారు. క్వాల్కామ్ కంపెనీ ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. డ్యూయల్ ప్రాసెసర్‌ను ఇందులో పొందుపరిచారు. ధర రూ.1,999. దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం.