ఫొటాన్ మ్యాక్స్ వైఫై... ప్లగ్ చేస్తే.. ఎక్కడైనా నెట్!
రోజంతా ఇంటర్నెట్ వాడుతూంటారా? స్మార్ట్‌ఫోన్‌తోపాటు పీసీ, టాబ్లెట్ కూడా ఉన్నాయా? అన్నింటికీ ఒకేసారి నెట్ కనెక్షన్ కావాలనుకుంటున్నారా? అయితే టాటా డొకోమో ఫోటాన్ వైఫై మ్యాక్స్ మీ కోసమే.
ఎక్కడ ప్లగ్ చేసుకుంటే అక్కడ ఓ మొబైల్ వైఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసే దీన్ని ఒకేసారి అయిదు గాడ్జెట్స్‌కు అనుసంధానించుకోవచ్చు. ఉపయోగించడం కూడా చాలా సులువు. యూఎస్‌బీ అడాప్టర్ ఉన్న ప్లగ్‌లోకి దీన్ని చొప్పించి పవర్ సాకెట్‌లో పెట్టేస్తే చాలు. నెట్ బ్రౌజింగ్‌కు వైఫై హాట్‌స్పాట్ రెడీ! టాటా ఫొటాన్ మ్యాక్స్ వైఫై పరికరాన్ని ‘శాస్త్ర’ బృందం వారం రోజులపాటు పరీక్షించింది. హైదరాబాద్ నలుమూలా ఉన్న సాక్షి ఉద్యోగులు ఒకరోజుపాటు దీన్ని వాడి చూశారు.
నెట్‌బ్రౌజింగ్‌తోపాటు వీడియో స్ట్రీమింగ్, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల డౌన్‌లోడింగ్, అప్‌డేషన్‌లకు ఉపయోగించి చూశారు. వీరిలో 75 శాతం మంది నెట్ వేగం బాగుందని మెచ్చుకోగా... మిగిలిన వారు ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్టవేగం 3.1 ఎంబీపీఎస్ వరకూ ఉంటుందని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇది 1.2 నుంచి 2 ఎంబీపీఎస్ వరకూ ఉన్నట్లు అంచనా. వంద మీటర్ల పరిధి వరకూ వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటవుతుందని కంపెనీ చెబుతోంది. కనెక్షన్ స్థిరంగా ఉన్నప్పటికీ దూరం పెరిగేకొద్దీ నెట్ వేగం మందగించింది. 20 నుంచి 30 మీటర్ల దూరం వరకూ మాత్రమే నెట్ వేగం బాగా ఉన్నట్లు గుర్తించాం.
రెండు, మూడు పరికరాలను అనుసంధానించినప్పుడు ఉన్నంత వేగం అయిదింటిని కనెక్ట్ చేసినప్పుడు లేకపోవడం గమనార్హం. దాదాపు రూ.2000 ఖరీదు చేసే ఈ పరికరం... నెలకు రూ.650 మొదలుకొని రూ.1500 వరకూ నెలవారీ ఛార్జీలతో అయిదు పరికరాలకు నెట్ అందిస్తుంది. ఒక్కో గాడ్జెట్ నెట్ ఛార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఇది కొంత చౌకనే చెప్పాలి.