‘సిప్‌’లు ఆగటం లేదు! | SIP Investments are Growing | Sakshi
Sakshi News home page

‘సిప్‌’లు ఆగటం లేదు!

Published Mon, May 20 2019 8:26 AM | Last Updated on Mon, May 20 2019 8:26 AM

SIP Investments are Growing - Sakshi

స్టాక్‌మార్కెట్‌ సూచీలిపుడు గరిష్ట స్థాయిలకు 5–6% దూరంలో ఉన్నాయి. అలాగని షేర్లూ అదే స్థాయిలో ఉన్నాయని చెప్పలేం. బ్లూచిప్‌లతో సహా మిడ్, స్మాల్‌ క్యాప్‌... ఇలా చాలా షేర్లు వాటి ఏడాది కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. కొన్నయితే జీవితకాల కనిష్ట స్థాయిల్లోనూ ఉన్నా యి. మరి ఇలాంటపుడు మ్యూచ్‌వల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారి పరిస్థితేంటి? వాళ్ల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదంటారు కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ థర్డ్‌ పార్టీ ఉత్పత్తుల హెడ్‌ డి.జయంత్‌ కుమార్‌. ‘‘ఫండ్ల పనితీరు... ఆ మార్కెట్‌ను బట్టేకదా ఉంటుంది? కాకపోతే నేరుగా ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసినవారు మరింత ఎక్కువగా నష్టపోయి ఉంటారు. ఫండ్ల ఇన్వెస్టర్లకు పరిమిత నష్టాలొచ్చాయి’’ అన్నారు . ఒకటి రెండేళ్లుగా సిప్‌ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తుండటం నిజమేనని, డెట్‌ ఫండ్లు కూడా నష్టాలిచ్చాయని అంగీకరించారు. ‘‘గత రెండేళ్లుగా మార్కెట్లలో ఇండెక్స్‌ ఆధారిత కొన్ని షేర్లు పెరుగుతున్నాయి తప్ప విస్తృత స్థాయిలో మార్కెట్‌ పెరగటమనేది లేదు. అందుకే సిప్‌ ఇన్వెస్టర్లూ నష్టాలు చూస్తున్నారు’’ అని చెప్పారాయన. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివిధ అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే...   – సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి

ఒకప్పటితో పోలిస్తే సిప్‌ ఇన్వెస్టర్లలో పరిణితి పెరిగింది. గతంలో మార్కెట్లు పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్‌ చేయటం... తగ్గుతున్నపుడు ఆపేయటం చేసేవారు. ఇపుడు అలాకాదు. తగ్గుతున్నపుడు చేస్తేనే తరవాత మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే వారిపుడు సిప్‌ను కొనసాగిస్తున్నారు. కార్వీ పరిధిలోనైతే దాదాపు 15 లక్షల ఎంఎఫ్‌ ఖాతాలున్నాయి. కాకపోతే అందులో క్రియాశీలకంగా ఉండేవి 3 లక్షల వరకూ ఉంటాయి. మాకు 260 బ్రాంచీలు ఉండటంతో ఆయా ఖాతాల్ని ఫాలో అప్‌ చేయటం, సిప్‌ పద్ధతిని ఎంచుకోమని సలహా ఇవ్వటం వంటివి చేస్తున్నాం. కార్పొరేట్‌ క్లయింట్లకు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేష¯Œ సదస్సులూ నిర్వహిస్తున్నాం. 

కార్వీని ఎంచుకున్న వారికి... 
నిజానికి బ్యాంకులతో సహా పలు సంస్థలు మ్యూచ్‌వల్‌ ఫండ్లలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. కాకపోతే కొన్ని సంస్థలు కొన్ని ఫండ్లనే సూచించటం జరుగుతోంది. మేం థర్డ్‌ పార్టీ కనక అన్ని ఫండ్లనూ ప్రమోట్‌ చేస్తాం. పైపెచ్చు మా సంస్థకున్న పటిష్ఠమైన రీసెర్చ్‌ విభాగం, ఫండ్‌ మేనేజర్లతో టచ్‌లో ఉండి వాటి మంచిచెడులు తెలుసుకోవటం మా కస్టమర్లకు ఉపయోగపడతాయి. ఆయా ఫండ్లు వివిధ కంపెనీల్లో ఏ మేర ఇన్వెస్ట్‌ చేశాయో తెలుస్తుంది కనక.. అది మా కస్టమర్లకు కలిసి వస్తుంది.  

డైరెక్ట్‌ ఫండ్లతో పోలిస్తే... 
థర్డ్‌ పార్టీ ద్వారా కాకుండా నేరుగా ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కాకపోతే ఒకటి రెండు ఫండ్లు ఎంచుకుని వాటిలో 10–15 ఏళ్లు దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చెయ్యాలనుకునే వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫండ్స్‌ పనితీరు ఆధారంగా మార్పులు చేసుకోవాలనుకునే వారికి ఇది కరెక్ట్‌ కాదు. మా ఇన్వెస్టర్ల వరకూ వస్తే... మేం 6 నెలలు లేదా ఏడాదికోసారి సమీక్షిస్తాం. వారి వ్యక్తిగత రిస్క్‌ ప్రొఫైల్‌ చూసి.. వారితో మాట్లాడతాం. తగు సూచనలు చేస్తాం.  

క్వాలిఫైడ్‌ సలహాదారుల అవసరం ఉంది... 
ప్రస్తుతం దేశంలో ఇన్వెస్టర్లు మెల్లగా పెరుగుతున్నారు. కాకపోతే వారికి సరైన సూచనలిచ్చే క్వాలిఫైడ్‌ అడ్వయిజర్ల అవసరం చాలా ఉంది. ఎందుకంటే మ్యూచ్‌వల్‌ ఫండ్ల వరకూ వచ్చేసరికి రీసెర్చ్‌ చేసి ఏ ఫండ్‌ బాగుంటుందో సూచించే సంస్థలున్నాయి. కానీ ఈ రీసెర్చ్‌లో పోస్ట్‌మార్టం మాత్రమే ఉంటుంది. అంటే గత పనితీరు ఆధారంగానే వీళ్లొక అంచనాకు వస్తారు. మళ్లీ గత పనితీరు భవిష్యత్తుకు కొలమానం కాదని కూడా చెబుతారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే వ్యవస్థ లేదు. ఈక్విటీలా అలాంటి వ్యవస్థ రావాలి. 

బ్రోకింగ్‌ ఖాతాలకూ సూచనలు!! 
ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసే తమ బ్రోకింగ్‌ ఖాతాదారులకు ప్రత్యేక సూచనలిస్తున్నట్లు కార్వీ ప్రయారిటీ ప్రొడక్ట్‌ హెడ్‌ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ‘‘వీటిలో ఎఫ్‌అండ్‌ఓ, ఇంట్రాడే, మార్జిన్‌ ట్రేడింగ్‌ వంటివి మేం సిఫారసు చెయ్యటం లేదు. ఖాతాల్లో డైవర్సిఫికేషన్‌ సూచిస్తున్నాం. వ్యాపారం బాగుండి, సహేతుకమైన స్థాయిలో డెట్‌ టు ఈక్విటీ ఉండే కంపెనీలను సూచిస్తున్నాం. మార్కెట్లు మరీ దారుణంగా ఉంటే ఏడాదిలో గరిష్టంగా 15% వరకూ రిస్క్‌ ఉంటుందని చెబుతున్నాం. ఆ రిస్క్‌కు సిద్ధపడిన వారికే ఈ సేవలు అందిస్తున్నాం. కస్టమర్ల రిస్క్‌ ప్రొఫైల్‌ను బట్టే ఈ బ్రోకింగ్‌ ఖాతాలను హ్యాండిల్‌ చేస్తున్నాం. ఇక్కడ కూడా కార్వీకి ఉన్న పటిష్ఠమైన రీసెర్చ్‌ విభాగం మా కస్టమర్లకు ఉపయోగపడుతుంది’’ అని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement