
‘మైనస్’లోనే డిమాండ్..!
మే నెలలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 2.36 శాతం క్షీణత
- వరుసగా ఏడో నెలా ఇదే ధోరణి
- ఆహార ద్రవ్యోల్బణం మినహా మిగిలినవన్నీ క్షీణతే...
న్యూఢిల్లీ: వ్యవస్థలో కొనసాగుతున్న డిమాండ్ మందగమన ధోరణికి ద్రవ్యోల్బణం అద్దం పడుతోంది. 2015 మే నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టోకు ధరల సూచీలో అసలు పెరుగుదల లేకపోగా ఈ రేటు వార్షికంగా 2.36 శాతం క్షీణించింది. అంటే టోకున బాస్కెట్ ధర 2014 మేతో పోలిస్తే 2015 మేలో అసలు పెరుగుదల లేకపోగా -2.36 శాతం క్షీణించిందన్న మాట. దీనిని ప్రతి ద్రవ్యోల్బణంగా (డిఫ్లేషన్) కూడా పరిగణిస్తారు. సూచీలో భాగంగా ఉండే మూడు విభాగాలనూ పరిశీలిస్తే- ఒక్క ఆహార టోకు ద్రవ్యోల్బణం మినహా అన్ని కేటగిరీలూ మైనస్‌లోనే ఉన్నాయి. ఆహార బాస్కెట్ ధర మాత్రం వార్షికంగా 2014 మేతో పోలిస్తే 2015 మేలో 3.80 శాతం పెరిగాయి.
నవంబర్ నుంచీ క్షీణ ధోరణి...
2014 నవంబర్‌లో ఈ సూచీ మొట్టమొదటిసారి తటస్థంగా ఉంది. డిసెంబర్‌లో టోకు ధరల రేటు 0.11 శాతంగా ఉంది. అటు తర్వాత జనవరి (-0.39 శాతం), ఫిబ్రవరి (-2.06 శాతం), మార్చి (-2.33 శాతం), ఏప్రిల్ (-2.65 శాతం)నెలల్లో ద్రవ్యోల్బణం క్షీణతలోనే కొనసాగింది.
మూడు విభాగాలూ వేర్వేరుగా...
- ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం (20.12 శాతం వెయిటేజ్)కు సంబంధించి ద్రవ్యోల్బణం రేటు 0.77 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఫుడ్ ఆర్టికల్స్ (వెయిటేజ్ 14.34 శాతం) ను తీసుకుంటే ఈ రేటు 3.80 శాతం పెరిగింది. అయితే నాన్-ఫుడ్ ఆర్టికల్స్ (4.26 శాతం వెయిటేజ్) విభాగం మాత్రం 2.24 శాతం క్షీణించింది.
- ఇక ఇంధనం- విద్యుత్ విభాగానికి (14.91% వెయిటేజ్) వస్తే ఈ రేటు 10.51 శాతానికి క్షీణించింది.
- ఇక మొత్తం సూచీలో 65.97 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం -0.64 శాతం క్షీణించింది.
భవిష్యత్ తేల్చాల్సింది రుతుపవనాలే...
ద్రవ్యోల్బణం మున్ముందుసైతం ఇదే పరిస్థితిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయో-లేవో తేల్చాల్సింది భవిష్యత్ వర్షపాత పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణంకన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటి వరకూ కురిసిన వర్షాలు కొంత సంతృప్తినిచ్చాయి. ఇప్పటికే ఈ ఏడాది 75 బేసిస్ పాయింట్లు రెపో తగ్గించిన ఆర్‌బీఐ... వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పట్లో మరోదఫా రేట్ల కోత ఉండకపోవచ్చని జూన్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది.
కూరగాయలు, ఆలూ ధరలు తగ్గాయ్..!
కూరగాయల ధరలు వార్షిక రీతిన మేలో పెరక్కపోగా 5.5 శాతం తగ్గాయి. ప్రత్యేకించి ఆలూ ధరలు 52 శాతం డౌనయ్యాయి. అయితే పప్పుధాన్యాల ధరలు 22.8 శాతం పెరిగాయి. ఉల్లిపాయల విషయంలో ఈ రేటు 20.41 శాతం పెరిగింది. కాగా పండ్లు, పాలు, గోధుమల వంటి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పండ్ల ధరలు 8.65 శాతం ఎగశాయి. పాల ధరలు 6.85 శాతం ఎగశాయి. గోధుమలు 2.79 శాతం ఎగశాయి.
మరోదఫా రేట్ల కోత అవసరం: పరిశ్రమలు
ద్రవ్యోల్బణం క్షీణ దశలో కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్‌కు, పారిశ్రామిక ఉత్పత్తుల వృద్ధికి ఆర్‌బీఐ మరోదఫా రెపో రేట్ల కోత నిర్ణయం తీసుకోవాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
సీఐఐ: ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం కూడా తగిన పాలనాపరమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ మరోదఫా రేట్ల కోతకు ఇది సరైన సమయం. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న స్థాయిలోనే (5% దిగువన) మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇది డిమాండ్‌కు ఊతం ఇచ్చే అంశం.
- ఫిక్కీ: సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ, ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి తగిన చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితి లేదు. రెపో రేటు తగ్గించడానికి ఇది తగిన సమయం.
అసోచామ్: ధరల స్థిరత్వానికి సంకేతంగా తగిన గణాంకాలు వెలువడుతున్నాయి. ఆర్థిక క్రియాశీలతను పెంపొందించడానికి ఇది సరైన సమయం. తయారీ రంగంసైతం క్షీణతలో ఉంటున్న విషయాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి.
రేట్ల కోతకు చాన్స్: ఎస్‌బీఐ, సిటీగ్రూప్
కాగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న స్థాయిలోనే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ఏడాది నాల్గవసారి రెపోరేటును మరోపావు శాతం తగ్గించే అవకాకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల దిగ్గజం సిటీగ్రూప్‌లు వేర్వేరుగా విడుదల చేసిన తమ తాజా విశ్లేషణా నివేదికల్లో పేర్కొన్నాయి.