స్మార్ట్ ఫోన్ల పరిస్థితి ఇక ఇంతేనా..!
'అరచేతిలో ప్రపంచం' కాన్సెప్ట్ తో పాటు... అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ల కోసం యూజర్లు ఎదురు చూస్తున్నారట. అదీ అందుబాటుల్లో.. సాధ్యమైనంత చవకగా దొరకాలని కోరుకుంటున్నారట. అందుకే ఇక ముందు స్మార్ట్ ఫోన్ మార్కెట్ వెలవెలబోనుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ వ్యాపారాలకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ లో అమ్మకాలు పడిపోతున్నాయట. వరుసగా జనవరి-మార్చి త్రైమాసికంలో 8.2శాతం క్షీణించాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు విడుదల చేసింది.
ఈ త్రైమాసికంలో కూడా అమ్మకాలు పడిపోవడం సాధారణ విషయం కాదని, ఇది తయారీ కంపెనీలు ఆలోచించాల్సి విషయమని చెబుతోంది. అక్టోబర్-డిసెంబర్ లో ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ను అందుకోవడానికి ఇన్వెంటరీ పెంచడంతోనే అమ్మకాల క్షీణతకు దారితీసిందని తెలిపింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కేవలం 5 శాతమే పెరిగాయని, అనంతరం నుంచి అమ్మకాలు తక్కువగానే నమోదవుతూ వస్తున్నాయని ఐడీసీ పేర్కొంది. అయితే ఏప్రిల్-జూన్ కూడా ఈ అమ్మకాలు ప్లాట్ గానే ఉంటాయని, గత ఏడాదిలా పెరుగుదల ఉండదని ఐడీసీ తెలిపింది. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లలోకి మారడానికి సమయం పడుతుండడంతోనే ఈ అమ్మకాలు తక్కువగా నమోదవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
సరియైన స్మార్ట్ ఫోన్ ఎంపికల కోసం, 4జీ ఫోన్ల కోసం బేసిక్ ఫోన్ యాజర్లు వేచి చూస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ట్రెండ్ తో ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలు ఫీచర్ల ఫోన్లపై మళ్లీ దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫోన్ల అమ్మకాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు.
స్మార్ట్ ఫోన్ డివైజ్ ల ధరలు అందుబాటులో లేకుండా.. ఇవే ధరలు కొనసాగితే యూజర్లను ఆకట్టుకోవడం కష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 4జీ స్మార్ట్ ఫోన్లు ధరలు ఈ ఏడాది చివరకు రూ.3,000 కిందకు వస్తే స్మార్ట్ ఫోన్ పరిశ్రమ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లలోకి మారే వాళ్లు కేవలం 10శాతమే ఉన్నారని, ముందు త్రైమాసికాల్లో ఈ శాతం 17-18గా ఉండేవారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.