
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడేళ్ల కిందట విద్యుత్ కొరతతో సతమతమైన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. 14,913 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ కోతలకు కాలం చెల్లింది. ఇదంతా బాగానే ఉంది!!. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన సోలార్ కంపెనీల భవిష్యత్తే అగమ్యగోచరంగా తయారయింది. రెండేళ్లుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేవు. వీలింగ్ అగ్రిమెంట్లకూ ప్రభుత్వం అనుమతులివ్వడం లేదు. నెట్ మీటరింగ్‌కు పర్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో 20కి పైగా కంపెనీలు కనుమరుగయ్యాయని, 10,000 మంది ఉద్యోగులు వీధిన పడ్డారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ పెట్టుబడులు..
తెలంగాణ రాష్ట్రంలో 3,142 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. పరిశ్రమ ప్రతినిధుల సమాచారం ప్రకారం 50 దాకా కంపెనీలు సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇంటిగ్రేటర్లు 200 దాకా ఉన్నారు. సౌర విద్యుత్ రంగంలోకి రూ.15,000–20,000 కోట్ల పెట్టుబడులొచ్చాయి. పలు కంపెనీలు సోలార్ సెల్స్, ప్యానెళ్ల తయారీకి రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దేశవ్యాప్తంగా 45% ప్యానెళ్లను సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్రంలోని కంపెనీలు ఇప్పుడు 5% లోపు కూడా అందించడం లేదు. 20 కంపెనీలకుపైగా మూతపడ్డాయని, 10,000 మంది పైచిలుకు రోడ్డున పడ్డారని ఓ ప్రముఖ కంపెనీ డైరెక్టర్ చెప్పారు. తమ కంపెనీలో 600 నుంచి ఉద్యోగుల సంఖ్య 150కి వచ్చిందని చెప్పారాయన. వాస్తవానికి సంప్రదాయ విద్యుత్‌కు ఒక్కో యూనిట్‌కు రూ.3.90 ఖర్చయితే, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కంపెనీలకు రూ.6.30 వరకూ ఖర్చవుతోంది. అధిక వడ్డీలు కూడా ఇందుకు కారణమన్నది ఓ కంపెనీ సీఈవో మాట. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఊతమివ్వకపోతే తయారీ కంపెనీలకు గడ్డుకాలమేనని అన్నారు.
కనీసం 100 మెగావాట్లు..
సోలార్ కంపెనీ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసి.. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఏదైనా కంపెనీకి విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తున్న ఓపెన్ యాక్సెస్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని పరిశ్రమ కోరుతోంది. ‘ప్రభుత్వం ఏటా కనీసం 100 మెగావాట్ల మేర ఓపెన్ యాక్సెస్‌కు తప్పనిసరిగా అనుమతివ్వాలి. ఇలా అయితేనే పరిశ్రమ నిలబడుతుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉపాధి లభిస్తుంది’ అని సురానా సోలార్ ఎండీ నరేంద్ర సురానా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలు ఓపెన్ యాక్సెస్‌ను అమలు చేస్తున్నాయన్నారు. రెండేళ్లుగా తెలంగాణలో పీపీఏలు లేవని మరో కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
కంపెనీలకు రూఫ్‌టాపే దిక్కా?
వ్యవసాయ పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్‌ను జనవరి 1న తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో కొత్తగా సోలార్ పంపుసెట్లు అమ్ముడయ్యే చాన్స్ లేదని ఓ కంపెనీ ఎండీ వ్యాఖ్యానించారు. ఇక కంపెనీలు రూఫ్‌టాప్ విభాగంపైనే ఫోకస్ చేయాల్సి ఉందన్నారాయన. నెట్ మీటరింగ్ విషయంలో మిగులు విద్యుత్‌కు ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు రూ.3.90 చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని పెంచితేనే రూఫ్‌టాప్‌కు కస్టమర్లు మొగ్గు చూపుతారని సైరస్ సోలార్ ఫౌండర్ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్ మీటరింగ్‌కు కస్టమర్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.